ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం రెండు కుటుంబాలకు చెందిన నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఇంటి గుమ్మంలో దొరికిన విషపూరితమైన టఫీలు తిని చనిపోయారని కుటుంబీకులు పేర్కొంటున్నారు. డోర్ వద్ద టఫీలే కాకుండా డబ్బులు కూడా కనిపించాయి. పెద్ద పిల్లాడు ఇంటి బయట ఉన్న టఫీలను తీసుకుని మిగతా ముగ్గురికి పంచాడని కుటుంబ సభ్యులు తెలిపారు. టఫీలు తిన్న కొద్దిసేపటికే నలుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. పిల్లలను జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.
విచారణకు ఆదేశించిన సీఎం
పిల్లల కుటుంబాలు షెడ్యూల్డ్ తెగ(ST) కమ్యూనిటీకి చెందినవి. పోలీసులు విచారణ ప్రారంభించి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారణకు ఆదేశించారు. అలాగే బాధిత కుటుంబాలకు తగు సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఖుషీనగర్‌లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ.. ఈ కేసులో మంత్రవిద్య కోణం ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు.