త్రిపురలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ త్రిపుర గోమతి జిల్లాలో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. దీంతో నలుగురు బీజేపీ నేతలు ప్రాణాలు కోల్పోగా.. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్టు తెలుస్తోంది.
వివరాళ్లోకెళితే.. త్రిపురలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి.. ఓ బహిరంగ సభకు హాజరైన నలుగురు నేతలు, మరికొంత మంది బీజేపీ కార్యకర్తలు ఓ మ్యాక్సీ ట్రక్కులో తిరిగి తమ స్వస్థలం నాతున్ బజార్‌కు వస్తుండగా.. చెల్లిగంజ్ వద్ద వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో నలుగురు స్థానిక నేతలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను ఊర్వశి కన్య జమాతియ (45), మమతా రాణి జమాతియా (26), రచనా దేవి జమాతియా (30), గహిన్ కుమార్ జమాతియా (65)గా గుర్తించారు.
ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్ దేవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మానిక్ సాహ తదితరులు విచారం వ్యక్తం చేశారు. అయితే.. ప్రమాదానికి ముందు బీజేపీ నేతలు హాజరైన సభలో సీఎం బిప్లబ్ కుమార్ దేవ్ ప్రసంగించడం విశేషం.