మధ్యప్రదేశ్ రాష్ట్రం షాహ్‌దోల్ జిల్లాలోని డియోలాండ్ పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొనుగోలు చేసిన సిగరెట్లకు డబ్బులు కట్టాలని అడిగినందుకు ఓ దుకాణదారును దారుణంగా కొట్టి చంపారు. డియోలాండ్ పట్టణానికి చెందిన అరుణ్ సోనీ అనే వ్యక్తి కిరాణ దుకాణం నడుపుతున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి మోనూ ఖాన్, పంకజ్ సింగ్, విరాట్ సింగ్ అనే నలుగురు వ్యక్తులు అరుణ్ సోనీ షాప్‌కు వెళ్లి సిగరెట్లు కొనుగోలు చేశారు. అనంతరం సిగరెట్లు వెలిగించుకుని డబ్బులు ఇవ్వకుండ వెళ్లిపోయే ప్రయత్నం చేశారు.
దీంతో షాపు యజమాని అరుణ్ సోనీ డబ్బుల కోసం నలుగురు వ్యక్తులను నిలదీశాడు. దీంతో కోపోద్రిక్తులైన నలుగురు అరుణ్ సోనీని తీవ్రంగా కొట్టారు. తండ్రి అరుణ్ సోనీని కొడుతుంటే అడ్డుకునే ప్రయత్నం చేసిన ఇద్దరు కొడుకులపై కూడా విచక్షణారహితంగా దాడి చేసి పారిపోయారు. అనంతరం ముగ్గురిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అరుణ్ సోనీ మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.