జమ్మూకశ్మీర్‌లోని దోడాలో బుధవారం ప్రయాణీకుల బస్సు చీనాబ్ నది కాలువలో పడిపోవడంతో 33 మంది మరణించారు. ఈ ఘటనలో మరో 22 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. బస్సు జారి 300 అడుగుల గోతిలో పడి ప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు.
గోతిలో పడిన బస్సు నంబర్ JK02CN-6555ను అధికారులు గుర్తించారు. ప్రమాదంలో ఇప్పటివరకు 33 మంది మరణించారని.. 22 మంది గాయపడ్డారని అధికారిక వర్గాలు తెలిపాయి. బటోట్-కిష్త్వార్ జాతీయ రహదారిపై ట్రుంగల్-అస్సార్ సమీపంలో రోడ్డుపై నుంచి జారి 300 అడుగుల లోతులో పడిపోయింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. పలు మృతదేహాలను వెలికి తీశారు.
దోడాలో జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను అవసరాన్ని బట్టి జిల్లా ఆసుపత్రి కిష్త్వార్ మరియు GMC దోడాకు తరలిస్తున్నారు. హెలికాప్టర్ సేవల ద్వారా తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అవసరాన్ని బట్టి అన్నిరకాల సహాయం అందించబడుతుంది. నేను నిరంతరం టచ్‌లో ఉన్నాను అంటూ రాసుకొచ్చారు.