లక్నోలోని వజీర్ హసన్ రోడ్‌లో మంగళవారం ఐదు అంతస్థుల భవనం కుప్పకూలడంతో ముగ్గురు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. "భవనం అకస్మాత్తుగా కూలిపోయింది. మూడు మృతదేహాలను కనుగొని ఆసుపత్రికి పంపారు.. క్షతగాత్రులను సివిల్ ఆసుపత్రిలో చేర్పించారు" అని యుపి ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ చెప్పారు. సంఘటనా స్థలంలో ఎన్‌డిఆర్‌ఎఫ్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ సలహాదారు అవనీష్ అవస్తీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. భవనంలో 15 మంది కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) నాయకుడు షాహిద్ మంజూర్ కుటుంబం కూడా ఇదే భవనంలో నివసించినట్లు తెలుస్తోంది. భవనం కుప్పకూలడానికి ముందు కాంగ్రెస్ నాయకుడు అమీర్ హైదర్ కూడా అక్కడ ఉన్నట్లు సమాచారం.