నోయిడా ఫేజ్ 2లో, ఫిబ్రవరి 21న తన స్నేహితుడిని హత్య చేసిన ఓ 26 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కౌశంబి జిల్లాకు చెందిన చంద్ర భాన్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు నోయిడాలోని ఓ అద్దె ఇంట్లో భార్యతో కలిసి నివసిస్తున్నాడు. మృతుడిని సంజీవ్ కుమార్‌గా గుర్తించారు, అతను కూడా ఆ దంపతులతో కలిసి అద్దె ఇంటిలో ఉండేవాడు.
నోయిడా ఫేజ్ 2 పోలీస్ స్టేషన్‌కు చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) సుజీత్ ఉపాధ్యాయ మాట్లాడుతూ "పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపింది. వైద్య నివేదికలో అతను గొంతు నులిమి హత్య చేయబడినట్లు వెల్లడైంది. భాన్, అతని భార్య వారి ఫ్లాట్ నుండి కనిపించకుండా పోయారు." అని తెలిపారు. కుమార్ సోదరుడు బిట్టు ఫేజ్ 2 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐపిసి సెక్షన్ 302 (హత్య) కేసు నమోదు చేయబడింది.
చంద్ర భాన్ ఉద్యోగం నుండి తిరిగి వచ్చిన సమయంలో తన భార్య, సంజీవ్ కుమార్ అసభ్యకరమైన రీతిలో ఉన్నట్లు చూశాడు. దీంతో కోపోద్రిక్తుడైన భాన్ సంజీవ్ కుమార్ హత్యకు ప్లాన్ చేశాడు. అదే రోజు రాత్రి ముగ్గురు కలిసి రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించిన తర్వాత భాన్ కుమార్‌ను గొంతు నులిమి హత్య చేసి భార్యతో కలిసి ఇంటి నుంచి పారిపోయాడు. భాన్‌ను కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి పంపనున్నారు. పరారీలో ఉన్న అతని భార్య కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.