కులాంతర వివాహం చేసుకున్న యువతిని చంపిన కుటుంబసభ్యులు
వేరే కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నందుకు 22 ఏళ్ల మహిళను ఆమె కుటుంబ సభ్యులు
By Medi Samrat Published on 19 Aug 2023 5:56 PM ISTవేరే కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నందుకు 22 ఏళ్ల మహిళను ఆమె కుటుంబ సభ్యులు గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని మూడో కంటికి తెలియకుండా తగులబెట్టాలని ప్రయత్నించారని గుర్గావ్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మహిళ తల్లిదండ్రులు, సోదరుడిని అరెస్టు చేశారు.
బీఎస్సీ విద్యార్థిని అంజలి, ఆమె భర్త సందీప్ ఝజ్జర్‌లోని సుర్హేటి లోని సెక్టార్ 102లోని రెసిడెన్షియల్ సొసైటీలో నివసిస్తున్నారు. అంజలి ప్రేమ వివాహం చేసుకోవడం ఆ కుటుంబ సభ్యులకు అసలు ఇష్టం లేదు. దీంతో ఆమెను అంతమొందించాలని ఫిక్స్ అయ్యారు. ఏసీపీ (క్రైమ్) వరుణ్ దహియా మాట్లాడుతూ, అంజలి కనిపించకుండా పోయిందని సందీప్ పోలీసులకు ఇటీవల సమాచారం అందించాడు. ఈ విషయంపై ఆరా తీయగా.. ఆమె సొంత కుటుంబమే ఈ పని చేసిందని తేలింది.
గురువారం సందీప్ ఓ పని నిమిత్తం తన సోదరి ఇంటికి వెళ్ళాడు. కునాల్ భార్య పనికి వెళ్లగా, అంజలి ఫ్లాట్‌లో ఒంటరిగా ఉందని ఆమె సోదరుడు తన తల్లిదండ్రులకు ఫోన్‌లో సమాచారం అందించాడు. అంజలి తల్లిదండ్రులు, కుల్దీప్ (44), రింకీ (42) ఫ్లాట్‌కి వెళ్లారు... అప్పటికే కునాల్ కూడా అక్కడికి చేరుకున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరూ అంజలిని పట్టుకోగా.. కుల్దీప్ గొంతు నులిమి చంపాడు. పోస్ట్‌మార్టం, పోలీసు విచారణ లేకుండా చేయడానికి మృతదేహాన్ని సొంత గ్రామం ఝజ్జర్ కు తీసుకుని వెళ్లి అక్కడ తగులబెట్టారని పోలీసులు విచారణలో తేలింది.
సందీప్ బ్రాహ్మణుడు, ఆమె జాట్ కావడంతో ఈ పెళ్ళికి యువతి కుటుంబం ఒప్పుకోలేదు. అనుమతి లేకుండా సందీప్‌ను వివాహం చేసుకోవాలని అంజలి తీసుకున్న నిర్ణయం కారణంగా.. సమాజంలో తలెత్తుకు బ్రతకలేకపోయామని తరచుగా చెప్పుకుంటూ ఉండేవాళ్లట. సమయం కోసం ఎదురుచూసిన అంజలి తల్లిదండ్రులు.. ఆమెను చంపేశారు.