ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో కలకలం మొదలైంది. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కనిపించకుండా పోయారు. జైద్‌పూర్ ప్రాంతంలోని కోలా గహబడి గ్రామానికి చెందిన ఇద్దరు టీనేజీ అమ్మాయిలు కనిపించకుండా పోవడంతో ఆ ప్రాంతంలో కలకలం మొదలైంది. ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లిన తర్వాత అదృశ్యమయ్యారని పోలీసులు సోమవారం తెలిపారు. 13, 14 సంవత్సరాల వయస్సు గల బాలికలు వారి ఇంటికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న జైద్‌పూర్‌లోని సాయి కళాశాలలో ఎనిమిది, తొమ్మిదో తరగతి విద్యార్థులు అని పోలీసులు తెలిపారు.
రోడ్డు పక్కన వారి దుస్తులు, సైకిళ్లు కనిపించడంతో పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. బాలికలు ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లారని, 8.45 గంటలకు వారి వస్తువులు కనిపించాయని, గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారని వారు తెలిపారు. అదృశ్యమైన బాలికల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ అనురాగ్ వాట్స్ తెలిపారు. కేసు ఛేదించేందుకు నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.