ఎట్టకేలకు ఆ మర్డర్లకు పాల్పడిన కోతులను పట్టేశారు
2 monkeys who killed 80 puppies caught. మహారాష్ట్రలోని బీడ్‌లో కుక్క పిల్లలను కావాలనే చంపుతూ వెళుతున్న రెండు కోతులను
By Medi Samrat Published on 19 Dec 2021 5:57 PM IST
మహారాష్ట్రలోని బీడ్‌లో కుక్క పిల్లలను కావాలనే చంపుతూ వెళుతున్న రెండు కోతులను నాగ్‌పూర్ అటవీ శాఖ బృందం పట్టుకుంది. రెండు కోతులను పట్టుకున్న తర్వాత వాటిని నాగ్‌పూర్‌లోని అడవుల్లో విడిచిపెట్టినట్లు బీడ్ ఫారెస్ట్ ఆఫీసర్ సచిన్ కంద్ తెలిపారు. బీడ్ ప్రాంతంలో కోతులు, కుక్కల మధ్య 'గ్యాంగ్ వార్' జరుగుతుండడంతో ఆ ప్రాంత ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఈ 'గ్యాంగ్ వార్'లో ఇప్పటివరకు చాలా కుక్కపిల్లలు చనిపోయాయి.
ముందుగా కోతి పిల్లలను కుక్క చంపిందని స్థానికులు చెబుతున్నారు. ఆ తర్వాత వాటి మధ్య 'గ్యాంగ్ వార్' మొదలైంది. గత 3 నెలల్లో కోతులు అనేక కుక్క పిల్లలను చంపేశాయని చెప్పారు. కుక్కలు, కోతుల మధ్య గొడవతో గ్రామమంతా భయానక వాతావరణం నెలకొంది. ఇప్పుడు రెండు కోతులను బంధించడంతో ప్రజలకు ఉపశమనం లభించింది. ఇప్పటికైతే అటవీశాఖ వారు రెండు కోతులను పట్టుకుని అడవుల్లోకి వదిలేశారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ మర్డర్లకు ఆ రెండు కోతులే కారణమని గ్రామస్తులు వాపోయారు. వాటిపై కాస్త కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
5 వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డుపై వెళ్తున్న వారిపై కూడా కోతులు పలుమార్లు దాడి చేశాయని తెలిపారు. కోతుల గుంపు తరచుగా కుక్క పిల్లల కోసం వెతుకుతూ ఉంటుంది. కుక్కపిల్లలు కనపడగానే వాటిని ఎత్తుకుని తమ వద్ద ఉంచుకునేవి. చెట్టు ఎక్కిన కుక్కపిల్లలు గాయాలు, ఆకలితో చనిపోయాయి. కోతుల బెడద ఎక్కువగా ఉన్నట్లు గ్రామస్థుల నుంచి సమాచారం అందిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి ఒక బృందాన్ని పంపి విచారణ చేపట్టారు.