కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి, 15 మందికి తీవ్ర గాయాలు

2 dead, 15 injured in explosion chemical factory in Gujarat. పంచమహల్‌ జిల్లాలో ఓ కెమికల్‌ ఫ్యాక్టరీలో గురువారం నాడు భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో కనీసం ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

By అంజి  Published on  16 Dec 2021 7:59 AM GMT
కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి, 15 మందికి తీవ్ర గాయాలు

గుజరాత్‌లోని పంచమహల్‌ జిల్లాలో ఓ కెమికల్‌ ఫ్యాక్టరీలో గురువారం నాడు భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో కనీసం ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఫ్యాక్టరీలో రెస్క్యూ, అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నాయని పంచమహల్ పోలీసు సూపరింటెండెంట్ లీనా పాటిల్ తెలిపారు. పేలుడు శబ్ధం చాలా పెద్దగా ఉండటంతో కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి పేలుడు శబ్ధం వినిపించింది.

ఘోఘంబ తాలూకాలోని రంజిత్‌నగర్ గ్రామానికి సమీపంలో ఉన్న గుజరాత్ ఫ్లోరోకెమికల్స్ లిమిటెడ్ (జిఎఫ్‌ఎల్) కెమికల్ తయారీ కర్మాగారంలో ఉదయం 10 గంటలకు పేలుడు సంభవించిందని పాటిల్ తెలిపారు. "పేలుడు, తదుపరి అగ్నిప్రమాదంలో సుమారు 15 మంది కార్మికులు గాయపడ్డారు. వారిని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరికి తీవ్ర కాలిన గాయాలు తగిలాయి" అని అధికారి తెలిపారు. దర్యాప్తుతో పాటు రెస్క్యూ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి సంఘటనా స్థలానికి అధికారులు చేరుకున్నారు.

ఘటనా స్థలంలో ప్రాణాలతో బయటపడిన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. ప్రస్తుతం మంటలు అదుపులో ఉన్నాయని పాటిల్ తెలిపారు. జీఎఫ్‌ఎల్‌ ఫ్లోరిన్ కెమిస్ట్రీలో 30 సంవత్సరాలకు పైగా నైపుణ్యాన్ని కలిగి ఉంది. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం.. ఇది ఆధునిక ప్రపంచంలోని వస్తు అవసరాలకు అనుగుణంగా ఫ్లోరోపాలిమర్‌లు, ఫ్లోరో-స్పెషాలిటీలు, రిఫ్రిజెరాంట్లు, రసాయనాలలో డొమైన్ నైపుణ్యాన్ని కలిగి ఉంది.

Next Story
Share it