ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్ జిల్లాలో మరో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 10వ తరగతి చదువుతున్న 17 మంది బాలికలకు మత్తు మందు ఇచ్చి.. వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు స్కూల్ మేనేజర్లు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఇద్దరు నిర్వాహకులపై ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దిగ్భ్రాంతికరమైన ఈ సంఘటన నవంబర్ 18న జిల్లాలోని పుర్కాజి ప్రాంతంలో జరిగింది. సీబీఎస్‌ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్ పేరిట 17 మంది 10వ తరగతి బాలికలను స్కూల్‌కు రప్పించారు.
ఇద్దరు నిందితులు రాత్రిపూట GGS ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద బాధితులకు భోజనంలో మత్తమందు కలిపి పెట్టాడు. బాలికలు అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత నిందితులు వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో విద్యార్థులతో మహిళా ఉపాధ్యాయులు ఎవరూ లేరు. విషయం ఎవరికైనా చెబితే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బాలికలను బెదిరించారు. తల్లిదండ్రులను చంపేస్తామని బాలికలను ఆ ఇద్దరూ స్కూల్ మేనేజర్లు బెదిరించారు. ఘటన జరిగిన మరుసటి రోజు బాధితులు పాఠశాలకు వెళ్లడం మానేసి తమ తల్లిదండ్రులకు జరిగిన బాధను వివరించారు.
కాగా ఘటనపై తాము ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, నిందితుల పాఠశాల నిర్వాహకులను రక్షించేందుకు ప్రయత్నించారని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపించారు. స్థానిక జర్నలిస్టుపై వదంతులు వ్యాప్తి చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే ఆరోపణలపై స్కూల్ మేనేజర్ల తరపున పోలీసులు అతనిపై కేసు పెట్టి ఒత్తిడి చేసేందుకు ప్రయత్నించారని తల్లిదండ్రులు ఆరోపించారు. స్థానిక బిజెపి నాయకుడు రంగంలోకి దిగి విచారణకు ఆదేశించడంతో రెండు వారాల తర్వాత ఈ సంఘటన బహిరంగమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.