ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బిజ్నోర్‌లో ఆరో తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలుడు తన తండ్రి తెచ్చిన చెప్పులు నచ్చలేదని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి పాఠశాలకు వెళ్లే ముందు విద్యార్థి తన తండ్రిని కొత్త చెప్పులు అడిగాడు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చెప్పులు ఇప్పిస్తానని తండ్రి హామీ ఇచ్చాడు. స్కూల్ నుంచి తిరిగొచ్చేసరికి నాన్న మార్కెట్ నుంచి చెప్పులు తీసుకొచ్చాడు. ఇంటికి రాగానే చెప్పులు చూసిన కొడుకు నచ్చలేదని చెప్పాడు.
చెప్పులు మార్చుకొని రావాలని పట్టుబట్టడం ప్రారంభించాడు. తండ్రి తర్వాత మారుస్తానని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన విద్యార్థి సాయంత్రం తన గదిలోకి వెళ్లి కిటికీకి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా సోమవారం బాలుడి అంత్యక్రియలు నిర్వహించారు. క్షుద్ర పూజల ప్రయోగం వల్లే బాలుడు మొండిగా మారాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ మహిళ తాంత్రిక ప్రయోగం చేసిందని ఆరోపించారు. ఈ విషయం తన దృష్టికి రాలేదని పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ శైలేంద్ర సింగ్ చౌహాన్ తెలిపారు.