రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టుకున్నాయి. దీంతో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ విషాద ఘటనలో 12 మంది ఆగ్నికి ఆహుతి అయ్యారు. ఈ ఘటన బుధవారం నాడు బార్మర్ - జోధ్‌పూర్ హైవేపై చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు, పోలీసులు వెంటనే సంఘటనా స్థలికి చేరుకున్నారు. బస్సులో మొత్తం 25 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 10 మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది ఇప్పటి వరకు బయటకు తీశారు.
మిగిలిన ప్రయాణికుల ఆచూకీపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకు 10 మందిని రక్షించారు. మిగిలిన ప్రయాణికుల గురించి ఎటువంటి సమాచారం లేదని పోలీసులు తెలిపారు. ఈ భారీ ప్రమాదంతో హైవేపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఒక ప్రయాణీకుడు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు ఉదయం 9:55 గంటలకు బలోత్రా నుండి బయలుదేరింది. రోడ్డుకి రాంగ్ సైడ్ నుండి వస్తున్న ట్యాంకర్ బస్సును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాద స్థలాన్ని పచ్‌పద్ర ఎమ్మెల్యే మదన్ ప్రజాపత్, రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి సుఖ్‌రాయ్ బిష్ణోయ్ పరిశీలించారు.