లాక్‌డౌన్ ఎఫెక్ట్: భారీగా తగ్గిన నేరాలు.. ఘోరాలు
By సుభాష్ Published on 6 April 2020 6:44 PM IST
దేశంలో ఒక వైపు కరోనా మహమ్మారి బుసలు కొడుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించడంతో జనాలు ఎవ్వరు కూడా బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఈ లాక్‌డౌన్ నేపథ్యంలో పలు చోట్ల నేరాల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. తాజాగా జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఏపీలో క్రైమ్ రేట్ కనిష్టానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
ఇక దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా క్రైమ్ రేట్ భారీగా తగ్గిందని తాజా రిపోర్టు చెబుతోంది. సుమారు 33 నుంచి 55శాతం వరకు నేరాలు తగ్గాయని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. లాక్‌డౌన్‌తో రోడ్లపైకి జనాలు రాకపోవడం, పోలీసుల గస్తీ, నిఘా భారీగా పెరగడంతో ఇది సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు.
రోడ్డు ప్రమాదాలు కూడా..
మరో వైపు దేశ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమలు కావడంతో రోడ్ల ప్రమాదాలు కూడా భారీగానే తగ్గిపోయాయి. లేకపోతే రోడ్లు ప్రమాదాలు జరగనిదే రోజు గడవదు. ఈ రోడ్లు ప్రమాదాల వల్ల ఎందరివో ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో నిత్యం 63రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, అందులో 18 మంది మృత్యువాత పడేవారు. ఇక మార్చి నెలలో లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి కేవలం 140 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. అంతేకాదు కిడ్నాప్ కేసుల సంఖ్య, హత్య కేసులు, లైంగిక దాడులు, అత్యాచారాలు, సైబర్ క్రైమ్ కేసులు కూడా భారీ సంఖ్యలోనే పడిపోయాయి.
తెలంగాణలో..
ఇక తెలంగాణలో కూడా నేరాల సంఖ్య 55 శాతానికి పడిపోయినట్లు తెలుస్తోంది. అలాగే రోడ్డు ప్రమాదాలు కూడా గణనీయంగా తగ్గాయట. ఇక మార్చి నెలలో దోపిడీలు, పగటి పూట చోరీలు, రాత్రిపూట దొంగతనాలు, హత్యలు, ఘర్షణలు, అత్యాచారాలు, హత్యలు, లైంగిక దాడులు, మోసాలు, రోడ్డు ప్రమాదాలు వంటివి గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది. మొత్తం మీద నిత్యం జరిగే నేరాలు, ఘోరాలు లాక్‌డౌన్ కారణంగా పూర్తిగా తగ్గిపోయాయనే చెప్పాలి.