ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం.. రూ.2500 ఇస్తే కరోనా నెగిటివ్ రిపోర్ట్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 July 2020 6:57 PM IST
ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం.. రూ.2500 ఇస్తే కరోనా నెగిటివ్ రిపోర్ట్

దేశ వ్యాప్తంగా రోజులు గడిచే కొద్దీ వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలతో పాటు ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్, ఆంధ్రా, తెలంగాణ కూడా కరోనా విసిరిన పంజాకు గిలగిలకొట్టుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి రూ.2500 ఇస్తే కరోనా ఉన్నా లేనట్లుగా రిపోర్టు ఇస్తున్న విషయం వెలుగు చూసింది. ఇలాంటి ఆస్పత్రుల వల్లే కరోనా అంతకంతకూ వ్యాప్తి చెందుతుందంటూ స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ఓ వైపు ప్రభుత్వాస్పత్రిలో సరైన వైద్యం అందక ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తే అక్కడ వచ్చే బిల్లులను చూసి లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళితే..ఉత్తర్ ప్రదేశ్ లోని న్యూ మీరట్ అనే ఆస్పత్రి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఆ ఆస్పత్రిలో పనిచేసే సిబ్బందికి బంధువైన ఒక వ్యక్తి కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. అయితే అతడికి కరోనా ఉన్నా.. లేనట్లు ఫేక్ రిపోర్ట్ ఇచ్చింది ఆస్పత్రి యాజమాన్యం.

ఈ విషయం బయటికి పొక్కడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు ఆస్పత్రి లైసెన్సును క్యాన్సిల్ చేసి, ఆస్పత్రిని సీజ్ చేశారు. అనంతరం ఆస్పత్రి యజమానిని అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ ఆస్పత్రిలో సిబ్బంది కరోనా ఫేక్ రిపోర్ట్ ల గురించి మాట్లాడుతున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఇదిలావుంటే.. ఉత్తర్ ప్రదేశ్ లో ఇప్పటి వరకూ 27,707 కేసులు నమోదవ్వగా 785 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. మరో 18,761 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Next Story