జంతువులపై కరోనా వ్యాక్సిన్‌ సక్సెస్‌: డబ్ల్యూహెచ్‌వో

By సుభాష్  Published on  24 April 2020 6:54 AM IST
జంతువులపై కరోనా వ్యాక్సిన్‌ సక్సెస్‌: డబ్ల్యూహెచ్‌వో

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. కరోనా వైరస్‌ పుట్టిన నాటి నుంచి వ్యాక్సిన్‌ను కనిపెట్టేందుకు పరిశోధకులు ఎంతో కృషి చేస్తున్నారు. ఈ వైరస్‌ వల్ల ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు విడిచారు. లక్షల్లో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ దాదాపు 200లకుపైగా దేశాలకు పాకింది. ఇక భారతదేశంలో కూడా రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుందోనని ప్రపంచమంతా ఎదురు చూస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ తయారీలో ఎన్నో దేశాలు తలమునకలవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఓ శుభవార్త చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 70 కరోనా వ్యాక్సిన్ల తయారీ వివిధ దశల్లో ఉన్నాయని, ఇక మూడు వ్యాక్సిన్లు మనుషులపై ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. కాగా, ఈ వ్యాక్సిన్‌ ఇప్పటికే కోతులు, ఎలుకలపై ప్రయోగాలు నిర్వహించారని, మొదటిదశ వ్యాక్సిన్‌ ప్రయోగాలు విజయవంతం అయ్యాయని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు.ఈ ప్రయోగాల్లో జంతువుల శరీరాల్లో సార్స్‌ -కోవ్‌-2 యాంటీ బాడీస్‌ను ఉత్పత్తి అయినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.

కోతులకు మొదటి డోస్‌ కింద మూడు మైక్రో గ్రాములు, రెండో డెస్‌ కింద ఆరు మైక్రో గ్రాముల చొప్పున వ్యాక్సిన్‌ ఇవ్వడం ద్వారా విజయవంతం అయ్యిందని, త్వరలోనే ఈ వ్యాక్సిన్‌ మనుషులపై ప్రయోగించి అందుబాటులో రానుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే కరోనా కోసం తయారు చేసిన ఈ వ్యాక్సిన్‌ దాదాపు పది రకాల వైరస్‌లను నాశనం చేస్తుందని శాస్త్రవేత్తల అద్యయనంలో గుర్తించారు.

Next Story