దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మాత్రం కరోనా వచ్చిన రోగులంతా కోలుకుని కరోనా ఫ్రీగా మారిపోయింది. దేశ వ్యాప్తంగా రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదవుతుంటే, పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాలకు కరోనా అంటే పెద్ద తలనొప్పిగా మారుతోంది. అయితే తక్కువ కేసులు నమోదైన చిన్న రాష్ట్రాలు సైతం కోలుకుంటున్నాయి.

ఇక తాజాగా కరోనా ఫ్రీ జాబితాలో త్రిపురా రాష్ట్రం చేరింది. ఈ రాష్ట్రంలో కరోనా బారిన పడిన ఇద్దరు రోగులు కోలుకుని డిశ్చార్జ్‌ అయినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విప్లబ్‌ దేవ్‌ వెల్లడించారు. పలు పరీక్షల్లో వారికి నెగిటివ్‌ రావడంతో రెండో రోగిని కూడా గురువారం డిశ్చార్జ్‌ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం తమ రాష్ట్రం ఒక్క కరోనా కేసు కూడా లేదని ట్విట్టర్‌లో వెల్లడించారు. అయినప్పటికీ ప్రతీ ఒక్కరు కూడా సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాల్సిందేనని, కేంద్రం మార్గదర్శకాలను పాటించాలని ఆయన తెలిపారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.