కరోనా రిపోర్టుతోనే అసెంబ్లీకి రావాలి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Sept 2020 6:54 PM ISTకరోనా నేఫథ్యంలో ప్రత్యేక పరిస్థితుల్లో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయని తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ సమావేశాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
కరోనా టెస్ట్ చేయించుకుని నెగిటివ్ వస్తేనే రిపోర్టుతో అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని.. మాస్కు ఉంటేనే సభలోకి అనుమతి ఉంటుందని తేల్చిచెప్పారు. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉంటే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించరని.. శరీర ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటేనే అనుమతి ఉంటుందని తెలిపారు.
జ్వరం లేకున్నా.. దగ్గు, జలుబు ఉన్నా సభకు రావొద్దని.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అధికారులు, సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధులు, మంత్రుల పీఎస్‌లు, పీఏలు తప్పనిసరిగా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని.. కొవిడ్ పాజిటివ్ అని తేలితే అసెంబ్లీ ప్రాంగణంలోకి రావొద్దని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రవేశాల వద్ద థర్మల్ స్క్రీనర్లు ఏర్పాటు చేశామన్నారు.
సభలో ఒక్కొక్క సీటుకు ఒక్క సభ్యుడే కూర్చుంటారని.. సభ రోజు ఉదయం, సాయంత్రం శానిటైజ్ చేస్తామని అన్నారు. 20 నుంచి 21 రోజులు సభ నడువొచ్చు అనుకుంటున్నామని.. అసెంబ్లీకి వచ్చే వాళ్ళు తమ బంధువుల ఫంక్షన్‌లు, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లకుండా ఉండాలని.. అసెంబ్లీ నుంచి ఇంటికి.. ఇంటి నుంచి అసెంబ్లీకి వచ్చే విధంగా చూసుకోవాలని కోరారు. ప్రభుత్వం తరుపున శాసన సభ్యులు, మండలి సభ్యులకు కిట్ ఇస్తున్నామని.. అందులో ఆక్సి మీటర్, శానిటైజేర్ ఉంటాయని.. ఆక్సిజన్ పర్సెంటేజ్ 90 లోపు ఉంటే సభకు రావొద్దని స్పీకర్ వెల్లడించారు.
సమావేశాల నిర్వహణకు సంబంధించి సీఎస్ సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులు, పోలీసులతో చర్చించామని పేర్కొన్నారు. గత సమావేశాలు వేరు, కొవిడ్ సమయంలో జరుగుతున్న ఈ సమావేశాలు వేరు అని స్పీకర్ అన్నారు. కరోనా నుంచి ఇంకా బయటపడలేదని. సీఎం కేసీఆర్ తగు చర్యలు తీసుకోవడం వల్ల రాష్ర్టంలో మరణాల సంఖ్య తగ్గిందన్నారు.