రెండు గంటల పాటూ రోడ్డు మీదనే మృతదేహం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 July 2020 7:36 AM GMT
రెండు గంటల పాటూ రోడ్డు మీదనే మృతదేహం

బెంగళూరు: కరోనా వైరస్ కేసులు దేశవ్యాప్తంగా విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది. కానీ మృతదేహాల తరలింపులో ప్రభుత్వాలు, అధికారులు జాప్యం చేస్తూనే ఉన్నాయి. కరోనా వైరస్ కారణంగా ఓ పేషెంట్ మరణించడంతో ఆ మృతదేహాన్ని తరలించడానికి దాదాపు రెండు గంటల పాటూ రోడ్డు మీదనే ఎదురుచూయించింది ప్రభుత్వం. బెంగళూరులో చోటుచేసుకున్న ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో 55 సంవత్సరాల వ్యక్తి శవం రోడ్డు మీదనే ఉంది. అంబులెన్స్ కోసం ఆ ఇంటి వాళ్ళు, చుట్టుపక్కల వాళ్లు ఎదురుచూస్తూ ఉన్నారు.

ఆ వ్యక్తికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఇంట్లో ఉండే చికిత్స తీసుకుంటూ ఉన్నాడని అతడి భార్య తెలిపింది. రిపోర్టులో పాజిటివ్ అని రావడంతో పాటూ అతడి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అతడిని ఆసుపత్రికి తీసుకుని వెళ్లాలని అంబులెన్స్ కు ఫోన్ చేశారు. కానీ అంబులెన్స్ రావడంలో ఆలస్యమైంది. ఇక చేసేది లేక ఆటో రిక్షాలో తీసుకుని వెళదామని ఆ వ్యక్తిని ఇంటి నుండి బయటకు తీసుకుని వచ్చారు. ఇంతలో అతడు కుప్పకూలిపోయి మరణించాడు. రోడ్డు మీదనే అతడి మృతదేహాన్ని ఉంచారు. దాదాపు రెండు గంటల అనంతరం అంబులెన్స్ అక్కడికి చేరుకుంది.

మినిస్టర్ ఇన్ ఛార్జ్ ఆర్. అశోక్ ఈ ఘటనపై స్పందించారు. అంబులెన్స్ ఆలస్యానికి కారణమైన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. బెంగళూరు సివిక్ బాడీ కమీషనర్ అనిల్ కుమార్ విచారణకు ఆదేశించారు.

గత వారం రోజుల్లో బెంగళూరులో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. శుక్రవారం నాడు 994 కొత్త కేసులు ఏర్పడ్డాయి. 7173 కేసులు నగర వ్యాప్తంగా నమోదయ్యాయి. 106 మంది చనిపోయారు. ఇంకా బెంగళూరు నగరంలో 6297 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. బెంగళూరులో మరోసారి లాక్ డౌన్ విధించే అవకాశం ఉందని అంటున్నారు.

Next Story
Share it