వ్యాక్సిన్ క్లినికల్ టెస్టింగ్ లో సామాన్యులకు ఛాన్స్.. ఎలానంటే?

By సుభాష్  Published on  4 July 2020 6:29 AM GMT
వ్యాక్సిన్ క్లినికల్ టెస్టింగ్ లో సామాన్యులకు ఛాన్స్.. ఎలానంటే?

ఆగస్టు పదిహేను నాటికి దేశీయ వ్యాక్సిన్ ను విడుదల చేయాలన్న పట్టుదలలో ఐసీఎంఆర్ తో పాటు.. సదరు వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ కు క్లినికల్ టెస్టులు చేయటానికి దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రులకు అనుమతులు మంజూరు చేశారు. సాధారణంగా క్లినికల్ టెస్టులు మూడు దశల్లో చేస్తారు. సమయం తక్కువగా ఉండటం.. వీలైనంత వేగంగా వ్యాక్సిన్ ను మార్కెట్లోకి తీసుకురావాలన్న లక్ష్యంతో తొలిదశ క్లినికల్ టెస్టుల్లోనే.. రెండు.. మూడు దశల్ని పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. క్లినికల్ టెస్టులు చేయించుకునే వారెవరు? ఎవరికి చేస్తారు? సామాన్యులకు కూడా అవకాశం ఉంటుందా? లాంటి ప్రశ్నలు చాలామందికి వస్తున్నాయి. ఇదే విషయాన్ని అధికారులతో మాట్లాడినప్పుడు ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. తెలంగాణలో నిమ్స్ ఆసుపత్రిలో సదరు వ్యాక్సిన్ కుక్లినికల్ టెస్టులకు అనుమతి ఇచ్చిన వైనం తెలిసిందే.

క్లినికల్ టెస్టులు ఎలా నిర్వహించాలనే అంశానికి సంబంధించి ఐసీఎంఆర్ నుంచి ప్రోటోకాల్ రానుంది. దాన్ని నిమ్స్ ఆసుపత్రి ఫాలో కానుంది. అదే సమయంలో సదరు ఆసుపత్రికి 12 మందితో కూడిన ఎథిక్స్ కమిటీ ఉంది. ఇందులో అన్ని వర్గాలకు చెందిన వారు ఉంటారు. నెల రోజుల పాటు 60 నుంచి 70 మందిపై క్లినికల్ టెస్టులు చేస్తారు. క్లినికల్ టెస్టులు చేసే వారు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా.. పూర్తి స్థాయి ఆరోగ్యవంతుల మీదనే ఈ వ్యాక్సిన్ ను ప్రయోగిస్తారు. మరి.. ఈ క్లినికల్ టెస్టులకు సామాన్యులకు అవకాశం ఉంటుందా? అంటే.. ఉందని చెబుతున్నారు.

క్లినికల్ టెస్టులకు ఒప్పుకునే వ్యక్తి కనీసం ఆర్నెల్ల వరకూ అందుబాటులో ఉండాలని చెబుతున్నారు. తొలుత వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కనీసం మూడు రోజుల వరకూ నిమ్స్ ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుంది. అనంతరం.. సదరు వ్యక్తిని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుంటారు. అతడి ఆరోగ్యంలోనూ.. శరీరంలోనూ వచ్చే మార్పుల్ని జాగ్రత్తగా గమనిస్తారు.

ఇక.. క్లినికల్ టెస్టులకు ఓకే చెప్పే వ్యక్తి.. నిమ్స్ వైద్యులకు అంతో ఇంతో తెలిసి ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు. కచ్ఛితమైన సమాచారంతో పాటు.. ఎవరైనా ముఖ్యుల రిఫెరెన్సు అవసరమన్న మాట వినిపిస్తోంది. క్లినికల్ టెస్టుల్లో పాలు పంచుకోవాలన్న ఉత్సాహం ఉంటేనే సరిపోదని.. అందుకు తగ్గ ప్రొసీజర్ కు అనుగుణంగా ఉంటే తప్పించి.. ఒప్పుకోరని చెబుతున్నారు. అదండి సంగతి. ఇప్పటికి క్లినికల్ టెస్టుల్లో పాల్గొనాలన్న ఆలోచన ఉంటే.. నిమ్స్ ను సంప్రదిస్తే సరిపోతుంది.

Next Story