కరోనాపై మోదీ సర్కార్ వార్.. 73 రోజుల్లో కొత్త ప్లాన్ రెఢీ
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Aug 2020 6:31 AM GMTకరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచం.. దానికి చెక్ పెట్టేందుకు అవసరమైన వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా? అని కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తోంది. చూస్తుండగానే ఆగస్టు పూర్తి కానున్న ఈ తరుణంలో.. వ్యాక్సిన్ రాకపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. వ్యాక్సిన్ విషయంలో భారతీయులకు ఒక గుడ్ న్యూస్ చెప్పేసింది కేంద్రం. కరోనాపై మోడీ సర్కారు చేస్తున్నయుద్ధం.. కీలక అంకానికి చేరుకుంది.
మరో 73 రోజుల్లో కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తున్నట్లుగా కేంద్రం వర్గాలు చెబుతున్నాయి. దీనికి బలం చేకూరేలా అక్టోబరు నెల చివర్లో సీరమ్ సంస్థ కోవిషీల్డ్ అనే పేరుతో వ్యాక్సిన్ ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ వ్యాక్సిన్ ను నేషనల్ ఇమ్యునైజేషన్ లో భాగంగా భారత ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది.
తాజాగా ఒక జాతీయ చానల్ తో మాట్లాడిన సీరం ప్రతినిధులు ఈ కీలక విషయాన్ని వెల్లడించారు. భారత సర్కారు తమకు లైసెన్సు ఇచ్చిందని.. ట్రయల్స్ ప్రోటోకాల్ ను తాము వేగవంతం చేసినట్లుగా చెప్పారు. ఈ ట్రయల్ మరో 58 రోజుల్లో పూర్తికానుందని. మూడో దశ ట్రయల్ లో ఇవ్వాల్సిన మొదటి మోతాదును శనివారమే ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ఇందులో భాగంగా రెండో మోతాను మరో పదిహేను రోజుల తర్వాత తుది నిర్ణయాన్ని తీసుకుంటామని చెబుతున్నారు.
దీని ఫలితాల ఆధారంగా కోవి షీల్డ్ ను మార్కెట్లోకి ఉత్పత్తి చేయనున్నట్లు చెప్పారు. సీరం ట్రయల్ రన్ చేస్తున్న వ్యాక్సిన్ సాంకేతికత ఆస్ట్రాజెనెకా సంస్థదిగా చెబుతున్నారు. వీరి నుంచి తయారీ హక్కుల్ని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. సీరం నుంచి టీకాల్ని భారత ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయనుంది. కరోనాపై కేంద్రం చేస్తున్న పోరు కీలకదశలోకి చేరటమే కాదు.. అన్ని అనుకున్నట్లుగా జరిగితే మరో 73 రోజుల్లో కరోనా అంతానికి డేట్ ఫిక్స్ అయినట్లేనని చెబుతున్నారు. మరేం జరుగుతుందో కాలమే డిసైడ్ చేయాలి.