దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ పొడిగింపు తప్పదు..!
By సుభాష్ Published on 11 April 2020 2:34 PM ISTదేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు ఇప్పటి లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఏప్రిల్ 14తో లాక్‌డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో శనివారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనాను పూర్తిస్థాయిలో అంతం చేయాలంటే మరికొన్ని వారాలు లాక్‌డౌన్ పొడిగించాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని మోదీకి సూచించారు. ఒక వేళ లాక్‌డౌన్ ఎత్తివేస్తే కరోనా మరింత విజృంభించే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్‌డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగించాలని మోదీతో తెలిపినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను ఎత్తివేయరాదని సీఎంలు కోరారు. అంతేకాదు కరోనా నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో ఆర్థిక పరమైన సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని, అందుకు ఆదుకోవాలని పలువురు ముఖ్యమంత్రులు మోదీని కోరారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సూచన మేరకు మోదీ కూడా లాక్‌డౌన్ పొడిగించేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం హైలెవల్ కమిటీలో సమావేశం కానున్నారు మోదీ. అధికారికంగా ప్రకటించకపోయినా.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సూచన మేరకు ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఆదివారం మోదీ వీడియో సందేశం ద్వారా లాక్‌డౌన్ ఎన్ని రోజులు పొడిగించనున్నారో అధికారికంగా ప్రకటించనున్నారు.
ఇప్పటికే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించేశారు. ఇక మరో వైపు లాక్‌డౌన్‌ను పొడిగిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని బీహార్ సర్కార్ సైతం కేంద్రానికి లేఖ రాసింది.
మాస్క్‌తో కాన్ఫరెన్స్‌లో మోదీ..
ప్రధాని మోదీ మాస్క్ ధరించి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. మామూలు మాస్క్ కాకుండా తెల్లటి వస్త్రంతో తయారు చేసిన మాస్క్‌ను ధరించారు. ఇంట్లో తయారు చేసిన మాస్క్‌లను సైతం వాడవచ్చని గత వారం కేంద్రం సూచించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు మోదీ ఈ మాస్క్‌ను ధరించినట్లు తెలుస్తోంది.