నిర్లక్ష్యం : పేకాటతో కరోనా..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 April 2020 10:17 AM ISTకరోనా విజృంభిస్తుంది. అందర్నీ ఇంటిపట్టునే ఉండి జాగ్రత్తలు పాటించండి అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెత్తి నోరు బాదుకుంటున్నాయి. అయినా కొంతమంది ఆ మాటలు పెడచెవిన పెడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి కారణంగా 24 మందికి కరోనా సోకింది.
వివరాళ్లోకెళితే.. విజయవాడ కృష్ణలంకకు చెందిన లారీ డ్రైవర్ ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చాడు. అతడికి వైరస్ సోకిన విషయం తెలియదు. ఈ విషయం తెలియక ఇరుగు పొరుగు వారితో పేకాట ఆడాడు. దీంతో అతడి ద్వారా 24 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అలాగే.. కార్మిక నగర్ లోనూ ఓ ఒక వ్యక్తి కారణంగా 15 మందికి వైరస్ సోకింది. కృష్ణా కలెక్టర్ ఇంతియాజ్ శనివారం ఈ విషయాన్ని వెల్లడించించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే విజయవాడ సిటీలో 100కు పైగా కేసులు నమోదయ్యాయని అన్నారు. కేవలం ఇద్దరి ద్వారా 39 మందికి కరోనా వ్యాపించిందని.. లాక్ డౌన్ ను ప్రజలు లెక్క చేయకుండా సరిగా పాటించనందు వల్లే విజయవాడలో భారీగా కేసులు పెరుగుతున్నాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ ను గౌరవించి, నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరారు.