దేశవ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి విస్తృతి కార‌ణంగా లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. అయినా వైర‌స్ వ్యాప్తి త‌గ్గుముఖం ప‌ట్ట‌‌కుండా రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే విద్యా సంస్థ‌ల ప్రారంభంపై యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్‌(యూజీసీ) నిపుణుల క‌మిటీ అధ్య‌య‌నం చేసింది. ఈ నేపథ్యంలోనే అకడమిక్‌ అంశాలు, ఆన్‌లైన్‌ విద్య తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు యూజీసీ రెండు కమిటీలను ఏర్పాటు చేసింది.

ఈ మేర‌కు దేశ‌వ్యాప్తంగా విద్యాసంస్థ‌ల ప్రారంభంపై ప‌లు సూచ‌న‌లు చేసింది. 2020-21 విద్యా సంవత్సరాన్ని జూలైలో కాకుండా సెప్టెంబర్‌లో ప్రారంభించాలని.. అప్పుడే విద్యా సంస్థలు తెరవాలని యూజీసీ నిపుణుల కమిటీ పేర్కొంది. హర్యానా వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ఆర్‌సీ కుహద్‌ నేతృత్వంలోని కమిటీ లాక్‌డౌన్‌ నేపథ్యంలో యూనివర్సిటీల్లో పరీక్షల నిర్వహణ, ప్రత్యామ్నాయ చర్యలపై అధ్యయనం చేసింది. ఇగ్నో వైస్‌ చాన్స్‌లర్‌ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మరో కమిటీ ఆన్‌లైన్‌ పరీక్షలపై అధ్యయనం చేసింది.
శుక్రవారం ఆ రెండు కమిటీలు తమ నివేదికలను యూజీసీకి అందజేశాయి. ఇక‌ కుహద్‌ నేతృత్వంలోని కమిటీ విద్యా సంవత్సరాన్ని జూలైకి బదులు సెప్టెంబర్‌లో ప్రారంభించాలని సూచించ‌గా.. నాగేశ్వర్‌రావు కమిటీ యూనివర్సిటీల్లో కావాల్సినన్ని మౌలిక సదుపాయాలు ఉంటే ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించవచ్చని సూచించింది. ఇదిలావుంటే.. కరోనా వైరస్‌ నేపథ్యంలో మార్చి నెల నుంచే కాలేజీలను, స్కూళ్లను మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నివేదిక‌ల‌పై ప్ర‌భుత్వం ఎటువంటి నిర్ణ‌యం తీసుకోనుందనేది ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశం.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.