కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన కరోనా సామాగ్రి ఎంతంటే?
By సుభాష్ Published on 9 July 2020 7:49 AM GMTకేంద్రం నుంచి తమకు పెద్దగా సహకారం అందకున్నా.. పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటున్నట్లుగా టీఆర్ఎస్ ముఖ్యనేతల మాటలు ఉంటాయి. తరచూ తమను విమర్శించే తెలంగాణ బీజేపీ నేతల్ని ఉద్దేశించి గులాబీ నేతలు విరుచుకుపడుతుంటారు. కేంద్రం నుంచి అరకొర సాయం తప్పించి.. సరిగా అందటం లేదన్న విమర్శల్ని వారు వినిపిస్తు ఉంటారు. ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణకు కేంద్రం పంపిన కరోనా సామాగ్రి లెక్కలు అనుకోని రీతిలో బయటకు వచ్చాయి. ఇదంతా విన్నప్పుడు కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందలేదన్నట్లుగా మాటల్లో వాస్తవం లేదన్న భావన కలుగక మానదు.
కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి.. తాజాగా కేంద్రం ఆరోగ్య శాఖామంత్రి హర్షవర్దన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో కరోనా టెస్టుల సంఖ్య పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇందుకు ఆయన నుంచి సానుకూల స్పందన వచ్చినట్లుగా పేర్కొన్నారు. ఢిల్లీ.. తమిళనాడు.. ఆంధ్రప్రదేశ్ ల మాదిరి వ్యవహరించినప్పుడు మాత్రమే సమస్య తీవ్రత తగ్గించటానికి అవకాశం ఉంటుందని పేర్కొనటం గమనార్హం.
రోజురోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోందని.. హైదరాబాద్ లోనూ పరిసర జిల్లాల్లోనూ కరోనా తీవ్రతతో పాటు.. మరణాల రేటు అధికంగా ఉందన్నారు. ఇప్పటికే తాము ఎన్ 95 మాస్కులు 7.14 లక్షలు.. పీపీఈ కిట్లు 2.41 లక్షలు.. హెచ్ సీ క్యూ ట్యాబెట్లను 23 లక్షలు.. 688 వెంటిలేటర్లు పంపినట్లుగా చెప్పారు. అంతేకాదు.. రానున్న రోజుల్లో 1220 వెంటిలేటర్లు పంపటానికి ఓకే చెప్పిట్లు పేర్కొన్నారు. వైద్య శాఖ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి రూ.215 కోట్లను విడుదల చేసిన వైనాన్ని గుర్తు చేశారు. ఈ లెక్కలన్ని వినప్పుడు గులాబీ నేతలు చెప్పినట్లుగా.. కేంద్రం ఎలాంటి సహకారం అందించటం లేదన్న మాట సరికాదన్న భావన వ్య్తక్తమవుతోంది.