జగన్ సర్కారు తాజా నిర్ణయం.. కేసీఆర్ ఫాలో కాక తప్పదా?

By సుభాష్  Published on  9 July 2020 5:49 AM GMT
జగన్ సర్కారు తాజా నిర్ణయం.. కేసీఆర్ ఫాలో కాక తప్పదా?

నిబంధనలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. సమయానికి తగ్గట్లు మారుతుంటాయి. సమయం.. సందర్భం చూసుకొని నిబంధనలకు కొత్త నిర్వచనం చెప్పేలా నిర్ణయాలు తీసుకుంటే పాలకులకు ఎదురే ఉండదు. ఆ విషయంలో మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చురుగ్గా ఉంటారని చెప్పక తప్పదు. ప్రపంచాన్ని వణికిస్తూ.. సామాన్యులకు షాకిస్తున్న కరోనా వైరస్ కు.. ఎంతమాత్రం భయపడాల్సిన అవసరం లేదన్న భరోసాను కల్పిస్తూ ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది.

సామాన్యులకు మేలు కలిగేలా తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వం మీద భారం పడినప్పటికీ.. పేద.. సామాన్య ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని చెప్పక తప్పదు. రేషన్ కార్డులు లేని కరోనా రోగుల్ని సైతం ఆరోగ్య శ్రీ పథకం కిందకు తీసుకొస్తూ జగన్ సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.

అంతేకాదు.. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు ఆరోగ్య శ్రీ కింద ఎంత మొత్తాన్ని చెల్లించాలన్న విషయానికి సంబంధించి పాటించాల్సిన విధివిధానాల్ని జగన్ సర్కారు తేల్చేసింది. దీని ప్రకారం సీరియస్ గా లేని పేషెంట్లకు రోజుకు రూ.3250 చెల్లిస్తే.. విషమంగా ఉన్న పేషెంట్లకు ఎంత మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందో స్పష్టం చేస్తూ తాజాగా ఆదేశాలుజారీ చేశారు.

దీని ప్రకారం.. ఐసీయూలో ఎన్ఐవీ పెడితే రోజుకు రూ.5980 కాగా.. ఐసీయూలో వెంటిలేటర్ పెడితే రోజుకు రూ.9580లుగా ఫిక్స్ చేశారు. అదే సమయంలో వెంటిలేటర్ లేకుండా ఎస్ఈపీఎస్ఐఎస్ రోజుకు రూ.6280 ప్రభుత్వం తరఫున ఇస్తామని అదే సమయంలో వెంటిలేటర్ తో కూడిన ఎస్ఈపీఎస్ఐఎస్ వైద్యానికి రోజుకు రూ.10,380 మొత్తాన్ని చెల్లించనున్నట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

వాస్తవానికి గడిచిన కొద్ది రోజులుగా కరోనాకు సంబంధించి ప్రైవేటు వైద్యం చేయించుకునే వారికి ఆరోగ్య శ్రీ ద్వారా సహకారం అందించాలన్న డిమాండ్ తెలంగాణలో పెరుగుతోంది. ఇప్పటివరకూ ఈ డిమాండ్ మీద ప్రభుత్వం స్పందించింది లేదు. ఏపీ సర్కారు తాజాగా విడుదల చేసిన ఆదేశాలు తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందిని కలిగిస్తాయని చెప్పక తప్పదు. తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున కోరుకుంటున్న దానిని.. ఏపీలో అక్కడి ప్రజలు కోరకున్నా జగన్ సర్కారు ఇచ్చేసినప్పుడు.. కేసీఆర్ సర్కారు ఎందుకు అమలు చేయదన్న ప్రశ్న రావటం ఖాయమంటున్నారు. తనను ఆత్మరక్షణలో పడేసిన ఏపీ సర్కారు నిర్ణయంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరం.

Next Story