రాఖీ వేళ‌.. స్వీటు షాపుల కోట్ల‌ వ్యాపారాన్ని తినేసిన కరోనా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Aug 2020 8:12 AM GMT
రాఖీ వేళ‌.. స్వీటు షాపుల కోట్ల‌ వ్యాపారాన్ని తినేసిన కరోనా

కాస్త మంచి వార్త విన్నంతనే నోటిని తీపి చేసుకునే అలవాటు మనది. అలాంటిది పండుగ వచ్చిందంటే చాలు.. ఇంట్లో మిఠాయిల మోత మోగాల్సిందే. ఇక.. రాఖీ లాంటి పండుగల సందర్భంగా భారీ ఎత్తున మిఠాయిల్ని కొనుగోలు చేయటం.. కనిపిస్తుంది. దసరా.. దీపావళి సందర్భాల్లో ఈ జోరు మరింత ఎక్కువ. కరోనా పుణ్యమా అని ఈ సీన్ మొత్తం మారిపోయింది.

మిఠాయి వ్యాపారులకు కీలకమైన రాఖీ పర్వదినం ఈసారి స్వీటు షాపు యజమానులకు చేదుగా మారింది. కరోనా కారణంగా రాఖీ పండుగ ఆన్ లైన్ పండుగా మారటం.. వీలైనంతవరకుఆన్ లైన్ లోనే రక్షా బంధన్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. దీనికి తోడు వైరస్ భయంతో మిఠాయిల్ని కొనుగోలు చేసే విషయంలో ఆసక్తిని ప్రదర్శించటం లేదు.

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించటంతో మిగిలిన వ్యాపారాల మాదిరే మిఠాయి దుకాణాలు మూతపడ్డాయి. లాక్ డౌన్ ఎత్తి వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత కొన్నిషాపులు మాత్రమే ఓపెన్ అయ్యాయి. ఖర్చులు తగ్గించుకునే మూడ్ లో ప్రజలు ఉండటం.. బయట వస్తువుల్ని (ఆహారపదార్థాలు) వీలైనంత తక్కువగా కొనుగోలు చేసే అలవాటులోకి వచ్చిన ప్రజలు మిఠాయి షాపుల్లో కొనుగోలుకు పెద్దగా ఆసక్తి చూపించటం లేదు. దీనికి బదులుగా ఇంట్లోనే మిఠాయిల్ని వండుకోవటం అలవాటుగా మార్చుకున్నారు. దీంతో.. మిఠాయి షాపులు తెరిచిన వారు అమ్మకాలు లేక ఇబ్బంది పడుతున్నారు.

ఇదిలా ఉంటే.. వంట మాస్టర్లతో పాటు.. స్వీటు షాపుల్లో పని చేసే సిబ్బంది సెలవుల్లో ఉండటం.. వైరస్ భయంతో వారు పనికి రాకపోవటం లాంటి కారణాలతో కొన్ని షాపుల్ని అసలు తెరవటం లేదు. మొత్తంగా ఈ వ్యాపార వర్గాల వారికి కీలకమైన రాఖీ పండుగ వేళ.. కరోనా భారీ దెబ్బ వేసిందన్న మాట వినిపిస్తోంది. గత ఏడాది రాఖీతో మొదలుకొని దీపావళి వరకు రూ.10వేల కోట్ల విలువైన మిఠాయి అమ్మకాలు జరిగితే.. ఈ ఏడాది రూ.5వేల కోట్ల కంటే తగ్గిపోతుందన్న మాట వినిపిస్తోంది. దీనికి కరోనా ప్రభావం ఒకటైతే.. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోవటం మరో కారణంగా చెబుతున్నారు. నోటిని తీపి చేసేవారి పరిస్థితే ఇలా ఉంటే.. మిగిలిన వ్యాపారాల పరిస్థితి మరెలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

Next Story