క్లినికల్ ట్రయల్స్.. తొలి అడుగు పడింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 July 2020 12:57 PM GMT
క్లినికల్ ట్రయల్స్.. తొలి అడుగు పడింది

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. కోటి 20లక్షల మందికి పైగా ఈ మహమ్మారి బారీన పడగా.. 5లక్షలకు పైగా మంది మృత్యువాత పడ్డారు. ఈ వైరస్‌ వ్యాప్తి మొదలై ఆరు నెలలు గడిచినా కూడా ఏ మాత్రం తగ్గకపోగా.. విస్తరిస్తోంది. ఇక భారత్ లో కూడా ఈ మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.

ఈ మహమ్మారికి మందును కనిపెట్టే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమైయ్యారు. అందులో భాగంగా కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు తొలి అడుగు పడింది. ఆరుగురు వలంటీర్ల నుంచి రక్తనమూనాలు సేకరించారు.

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకాకు సంబంధించి ఇప్పటికే పలు దఫాలుగా ప్రయోగాలు చేశారు. మనుషులపై దీన్ని ప్రయోగించేందుకు ఇటీవల ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. ఈ ట్రయల్స్‌ కోసం దేశ వ్యాప్తంగా 12 ఆస్పత్రులు ఎంపిక కాగా.. అందులో హైదరాబాద్‌లోని నిమ్స్‌ కు అవకాశం లభించింది. భారత్ బయోటెక్ ఫార్మా- ఐసీఎంఆర్‌ సంయుక్తంగా క్లినికల్ ట్రయల్స్ ను చేపట్టాయి.

అందులో భాగంగా.. మంగళవారం నిమ్స్ లో ఆరుగురు వలంటీర్ల రక్త నమూనాలు సేకరించారు. వీటిని ఢిల్లీలోని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)కు పంపారు. అక్కడ పరీక్షించి నిమ్స్ కు నివేదిక పంపిస్తారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న వారిపై తొలుత ఒక డోసు వ్యాక్సిన్ ప్రయోగిస్తారు. రెండు రోజుల పాటు ఆస్పత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో వారి ఆరోగ్య పరిస్థితులను అంచనావేస్తారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించుకున్నాక వలంటీర్లను ఇళ్లకు పంపిస్తారు. ఇంటికి వెళ్లిన.. 14 రోజుల పాటు నిమ్స్‌ డాక్టర్లు వారిని ఫోన్‌ ద్వారా పర్యవేక్షిస్తుంటారు. వారి ఆరోగ్యంలో వస్తున్న మార్పులను నమోదు చేసుకుంటారు. రెండు రోజుల్లోనే క్లినికల్ ట్రయల్స్ కు అవసరమైన వ్యాక్సిన్ రానుందని సమాచారం. మొత్తం 60మంది వలంటీర్లు అవసరం అవుతారని వైద్యులు తెలిపారు. రెండు రోజుల్లోనే క్లినికల్ ట్రయల్స్ కు అవసరమైన వ్యాక్సిన్ రానుందని సమాచారం. మొత్తం 60మంది వలంటీర్లు అవసరం అవుతారని వైద్యులు తెలిపారు.

Next Story