గాంధీ ఆస్పత్రిలో దారుణం.. చనిపోయి 8గంటలు అయిన
By తోట వంశీ కుమార్ Published on 15 July 2020 7:36 AM GMTహైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. కరోనాతో ఓ వ్యక్తి చనిపోయి 8 గంటలు గడిచినా కూడా వార్డు నుంచి మృతదేహాన్ని మార్చురీకి తరలించలేదు. దీంతో ఆ వార్డులోని ఇతర కరోనా రోగులంతా ఆందోళన చెంది ఇతర వార్డులకు పరుగులు పెట్టారు. ఈ ఘటన మంగళవారం గాంధీలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మంగళవారం మధ్యాహ్నం కరోనాతో ఓ వ్యక్తి మృతి చెందాడు. అయితే.. కాంట్రాక్టు సిబ్బంది, ఆస్పత్రిలోని ఇతర సిబ్బంది గత నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించే వారు కరువైయ్యారు. ఆస్పత్రిలో ఉన్న పర్మినెంట్ ఉద్యోగులు ఐసీయూలో విధులకే పరిమితం అయ్యారు. దాంతో ఎనిమిది గంటల పాటు వార్డులోని బెడ్‌పైనే మృతదేహాం ఉండి పోయింది. దీంతో ఆ వార్డులోని మిగతా పేషంట్లు ఆందోళనకు గురయ్యారు. అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోయేందుకు ప్రయత్నించినా.. స్పందన కరువైందన్న విమర్శలు వచ్చాయి. మృతదేహం నుంచి దుర్వాసన వచ్చిందన్న ఆరోపణలు వినిపించాయి. చివరికి రాత్రి ఏడు గంటల తరువాత మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.