బ్లాక్ మార్కెట్‌లో యాంటీ వైరల్ డ్రగ్స్ : 8 మంది అరెస్ట్‌

By Medi Samrat  Published on  14 July 2020 2:20 PM GMT
బ్లాక్ మార్కెట్‌లో యాంటీ వైరల్ డ్రగ్స్ : 8 మంది అరెస్ట్‌

హైద్రాబాద్ న‌గ‌రంలో కొవిడ్‌ యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ను బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్న ముఠాను పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించి నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. సౌత్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు ఈ రోజు పాతబస్తీలో అంతరాష్ట్ర బ్లాక్‌ మార్కెట్‌ ముఠాను అరెస్ట్‌ చేశార‌ని తెలిపారు.

కరోనా వైరస్‌ బారిన పడిన వారికి.. ప‌ట్టుబ‌డిన ఈ 8 మంది బ్లాక్‌లో అక్రమంగా యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ను‌ విక్రయిస్తున్నారని తెలిపారు. వారివ‌ద్ద‌ నుంచి రూ. 35.5 లక్షల రూపాయల విలువ చేసే మెడిసిన్‌ స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ ముఠాలో కింగ్ పిన్‌గా వెంకట సుబ్రమణ్యం వ్యవహరిస్తున్నాడని తెలిపారు.

మెడిసెన్స్‌ రూ. 10 వేల నుంచి రూ. 50 వేల వరకు బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్నారని చెప్పారు. ముఠా సభ్యుల నుండి కరోనా టెస్ట్‌ చేసే ర్యాపిడ్‌ కిట్స్‌, ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ కేసులో సౌత్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌కు.. చార్మినార్‌ డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు సాయం చేశారని అంజనీకుమార్‌ పేర్కొన్నారు.

మెడికల్‌ రిప్రజెంటెటివ్స్‌ ద్వారా ఈ మందులను మార్కెట్‌లో చలామణి చేస్తున్నారని చెప్పారు. ఆస్పత్రిలో చేరిన కరోనా బాధితుడి కుటుంబ సభ్యులకు ఈ మందులు విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఈ మెడిసిన్‌కు ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కృతిమ కొరత సృష్టించి.. లక్ష రూపాయలకు మెడిసిన్‌ను విక్రయిస్తున్నారని చెప్పారు. ఫార్మ కంపెనీల డిస్టిబ్యూటర్స్‌, మెడికల్‌ రిప్రజెంటెటివ్స్‌, మెడికల్‌ షాపు యజమానులు జాగ్రత్తగా ఉండాలని కమిషనర్‌ అంజనీకుమార్ హెచ్చరించారు.

వైద్యులు కూడా పరిస్థితి విషమంగా ఉన్న కరోనా బాధితులకు ఫాబి ఫ్లూ ఇంజక్షన్స్‌ను వినియోగిస్తున్నారని.. ఇది గమనించిన ఈ ముఠా మెడిసిన్‌ను బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్నట్టు వెల్లడించారు. కేసు న‌మోదు చేసిన అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Next Story