హైదరాబాదీయుల కొత్త ఐడియా.. ఇల్లు ఖాళీ చేసి అలా చేస్తున్నారు

By సుభాష్  Published on  15 July 2020 10:25 AM GMT
హైదరాబాదీయుల కొత్త ఐడియా.. ఇల్లు ఖాళీ చేసి అలా చేస్తున్నారు

తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్ మహానగరం కరోనా కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మహమ్మారి ముందు వరకు నిత్యం హైదరాబాద్ కు వచ్చేందుకు లక్షలాది మంది రైళ్లు.. బస్సులు.. విమానాలు.. సొంతవాహనాల్లో వచ్చి పోతుండేవారు. నిత్య కల్యాణం పచ్చ తోరణం మాదిరి మహా హుషారుగా ఉండేది. పగలు.. రాత్రి అన్న తేడా లేకుండా అదే ఎప్పుడూ హడావుడిగా కనిపించేది. ఇక.. పబ్బులు.. బార్లు.. రెస్టారెంట్లు సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక.. మల్టీఫ్లెక్సులు సైతం అర్థరాత్రి రెండు గంటల వరకు సాగేవి. మళ్లీ పొద్దున్న ఎనిమిది గంటల కల్లా మొదలయ్యేవి. ఇలా.. ఏ మూల చూసినా ఏదో ఒక యాక్టివిటీ జోరుగా సాగుతుండేది.

వీధుల్ని హడావుడిగా ఉంటూ.. ఎవరికి వారు క్షణం కూడా తీరిక లేని జీవితంలో ఉరుకులు పరుగులు తీస్తుంటారు. కరోనా ఎంట్రీతో హైదరాబాద్ లోని సీన్ మొత్తం మారిపోయింది. లాక్ డౌన్ తో ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి జారిపోయిన నగరం.. అన్ లాక్ తర్వాత కోలుకున్నది లేదు. ఇటీవల కాలంలో రోజుకు వెయ్యి నుంచి పదిహేనువందల వరకూ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న వేళ.. హైదరాబాద్ ను వదిలేసి ఊళ్లకు వెళ్లిపోతున్న వారు అంతకంతకూ పెరిగిపోయారు.

తొలుత ఐటీ ఉద్యోగులు..విద్యార్థులు హాస్టళ్లలోనూ.. పీజీల్లోనూ ఉండే వారు వెళ్లిపోతే.. తర్వాతి కాలంలో వలసకూలీలు వెళ్లిపోవటం తెలిసిందే. ఈ హడావుడిలోనేకొన్ని వర్గాలకు చెందిన వారు వెళ్లిపోవటం మొదలైంది. ఇటీవల మరోమారు లాక్ డౌన్ విధించే అవకాశం మహానగరంలో ఉందన్నచర్చ జోరుగా సాగింది. అదేసమయంలో.. రానున్న ఆరేడు నెలల పాటు కరోనా ముప్పు ఖాయమన్న విషయం అర్థమయ్యాక ఎవరికి వారుసొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వారైతే.. సొంతోళ్ల వద్ద గడపాలని వెళ్లిపోతే.. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వారు వారి ఊళ్లకు పయనమయ్యారు.

ఆరేడు నెలలకు పైనే కరోనా ప్రమాదం పొంచి ఉండటంతో..చాలామంది ఇళ్లనుఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. మరికొందరు మాత్రంఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తాన్ని ఊరికి తీసుకెళ్లి మళ్లీ తిరిగి తీసుకురావటం కష్టమని భావిస్తున్నారు. ఈ క్రమంలో కొత్తఐడియా ఒకటి వేస్తున్నారు. ఇళ్లనుఖాళీ చేసి.. ముఖ్యమైన సామాగ్రితప్పించి.. మిగిలిన వారిని పెద్ద పెద్ద గోదాముల్లో అద్దెకు స్థలాన్ని తీసుకుంటున్నారు. కుటుంబం మొత్తం ఊరికి వెళ్లిపోతున్న వేళ.. ఇంటి అద్దెను అనవసరంగా కట్టటం ఎందుకున్న ఉద్దేశంతో ఇళ్లను ఖాళీ చేస్తున్న వారు చాలామందే ఉన్నారు.

దీంతో.. నగరంలోని చాలా చోట్ల టూలెట్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇళ్లను ఖాళీ చేస్తున్న వారు ఊరికి మొత్తం సామాగ్రిని తీసుకెళ్లలేని వారు హైదరాబాద్ లో ఖాళీ ప్లేస్ ను అద్దెకు ఇచ్చే వారి దగ్గర తమ సామాన్లను భద్రపర్చుకుంటున్నారు. వీరి వద్ద నుంచి సదరు స్థలానికి సంబంధించి అద్దె చెల్లిస్తే సరిపోతుంది. ఇంటి అద్దెతో పోలిస్తే.. ఈ మొత్తం చాలా తక్కువని చెబుతున్నారు.

ఈ కొత్త ట్రెండ్ ఇప్పుడు హైదరాబాద్ లో ఒక అలవాటుగా మారిందన్న మాట వినిపిస్తోంది. ఇళ్లు మాత్రమే కాదు.. పలు వాణిజ్యం సంస్థలు.. ఐటీ ఆఫీసులు సైతం తమ ఆఫీసుల్ని ఖాళీ చేస్తూ.. ఖర్చుల్ని తగ్గించుకునే పనిలో పడినట్లుగా తెలుస్తోంది. దీంతో.. కమర్షియల్ స్పేస్ కు కూడా గిరాకీ పడిపోయినట్లుగా చెబుతున్నారు. ఎప్పటికప్పుడు ట్రెండ్ కు తగ్గట్లు సర్వీసుల్ని అందించటం ఒక ఎత్తు అయితే.. దాన్ని తమకు తగ్గట్లు అందిపుచ్చుకోవటంలో హైదరాబాదీయులు ముందుంటారన్న విషయం తాజా అంశంలో మరోసారి అర్థమైందని చెప్పక తప్పదు.

Next Story