సీఎం జగన్ ను కలిసిన సినీ నటుడు అలీ
By తోట వంశీ కుమార్
కమెడియన్ అలీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన అలీ సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అలీ ఓ మొక్కను జగన్‌కు బహుకరించారు. 2019 ఎన్నికల సమయంలో అలీ.. వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. జగన్ సమక్షంలోనే పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనకు అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు అయిన జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ అలీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అప్పట్లో ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. గుంటూరు నుంచి అసెంబ్లీ బరిలో దిగాలని ఆయన భావించినట్టు తెలిసింది.
ఎన్నికల్లో టికెట్ లభించని నేపథ్యంలో, అలీకి ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎఫ్ డీసీ) చైర్మన్ పదవి ఇస్తారని కూడా మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, అలీ తాజాగా సీఎం జగన్ ను కలవడం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. ఈ భేటీకి సంబందించిన వివరాలు తెలియాల్సి ఉంది. అలీ జగన్ ను ఎందుకు కలిశారన్నది అందరిలో ఆసక్తి కలిగిస్తుంది.