ప్లాస్మాను అమ్ముకుంటున్నారట..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Sep 2020 11:31 AM GMT
ప్లాస్మాను అమ్ముకుంటున్నారట..!

లాక్ డౌన్ సమయాల్లో ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నారు. కరోనా నుండి రికవరీ అయిన వాళ్లు ఆర్థిక ఇబ్బందుల నుండి కోలుకోడానికి ప్లాస్మాను అమ్ముకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది.

నెల్లూరు లోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ లో ఓ వ్యక్తి ప్లాస్మాను ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. 5000 రూపాయలు ప్రభుత్వం ఇస్తూ ఉండగా.. ప్లాస్మాను ఇస్తానని అడిగిన వ్యక్తి ఇంకా ఎక్కువ డబ్బును డిమాండ్ చేశాడు. అందుకు అధికారులు ఒప్పుకోలేదు. దీంతో సదరు వ్యక్తి ఎవరికైతే ప్లాస్మా అవసరమో ఆ కుటుంబాన్ని సంప్రదించాడు. మీరేమైనా ఎక్కువ డబ్బులు ఇవ్వగలరా అని పేషెంట్ కుటుంబాన్ని అడిగాడు. అతడు అడిగిన డబ్బులు ఇవ్వలేమని వారు చెప్పడంతో సదరు వ్యక్తి సైలెంట్ గా జారుకున్నాడు.

విశాఖపట్నంలో కూడా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ సీనియర్ అధికారి కోవిద్-19 బారిన పడ్డాడు. అతడికి కూడా ప్లాస్మా కావాలని వెతుకుతూ ఉండగా.. ఓ వ్యక్తి బ్లడ్ గ్రూప్ కు పేషెంట్ బ్లడ్ గ్రూప్ కు సరిపోయింది. దీంతో ఆ వ్యక్తి తనకు ఎక్కువ డబ్బులు ఇవ్వాలని కోరాడు. కోవిద్-19 కారణంగా కుటుంబం గడవడమే కష్టమవుతోందని ప్లాస్మా ఇస్తాను కాస్త ఎక్కువ డబ్బు ఇవ్వండి అని అడిగాడట..!

రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్మా దానం చేసిన వారికి 5000 రూపాయలు ఇస్తామని చెబుతోంది. అయితే అది ఎవరు ఇస్తారు.. ఎలా ఇస్తారు అన్న విషయం ప్లాస్మాను ఇస్తున్న వారికి తెలియడం లేదు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిద్-19 పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు ప్లాస్మా థెరపీ చేస్తూ ఉన్నారు. 400 ఎంఎల్ ప్లాస్మా కు 14000 రూపాయల వరకూ ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులలో వసూలు చేస్తూ ఉన్నారు. కొందరు మధ్యవర్తులు ప్లాస్మా విషయంలో కూడా వ్యాపారాలు చేయడం మొదలుపెట్టారు. బ్లడ్ బ్యాంకులలో ప్లాస్మా లభించకపోతే తమకు తెలిసిన వారు ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున డబ్బు గుంజడానికి కూడా వెనుకాడడం లేదు. కరోనా నుండి కోలుకున్న పేద, మధ్యతరగతి వ్యక్తులకు డబ్బులను ఆశగా చూపి ప్లాస్మా వ్యాపారం చేస్తున్నారు. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు కూడా మధ్యవర్తులకు భారీగా కమీషన్లను ఇస్తోంది. వీటిని అరికట్టాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతూ ఉన్నారు.

Next Story
Share it