జీఎస్టీపై అభ్యంతరాలు తెలుపుతూ మోదీకి లేఖ రాసిన కేసీఆర్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Sep 2020 1:12 PM GMT
జీఎస్టీపై అభ్యంతరాలు తెలుపుతూ మోదీకి లేఖ రాసిన కేసీఆర్

జీఎస్టీ ప్రతిపాదనలపై అభ్యంతరాలు తెలుపుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. జీఎస్టీ చట్టాన్ని కేంద్రం ఉల్లంఘించిందని.. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారరం తగ్గించాలన్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేసీఆర్ లేఖలో తెలిపారు. రుణాలపై ఆంక్షలు కరెక్ట్ కాదని.. జీఎస్టీ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని కేసీఆర్ కోరారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్టేనని.. బలమైన రాష్ట్రాలు ఉంటేనే బలమైన దేశం అవుతుందని అన్నారు కేసీఆర్.

కేంద్రమే రుణం తీసుకొని రాష్ట్రాలకు పూర్తి పరిహారం చెల్లించాలని.. చట్టం ప్రకారం 14 శాతం వృద్ధి రేటు ఆధారంగా రాష్ట్రాలకు ఆదాయం తగ్గితే.. కేంద్రమే పరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం తప్పకుండా ఇస్తామని చట్టంలో చెప్పి.. ఇప్పుడు ఉల్లంఘిస్తున్నారని, యూపీఏ ప్రభుత్వం బాటలో ఎన్డీయే కూడా పయనిస్తుందేమోనని జీఎస్టీని ప్రశ్నించామని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం రూ. 3,800 కోట్లు నష్టపోయింది. రాష్ట్రాల ఒత్తిడి మేరకు రెవెన్యూ నష్టాన్ని పూడ్చడానికి ప్రతి రెండు నెలలకోసారి పూర్తి జీఎస్టీ పరిహారం చెల్లించే విధంగా జీఎస్టీ పరిహార చట్టాన్ని రూపొందించారు. చట్టంలో అంత కచ్చితంగా నిబంధన ఉన్నా జీఎస్టీ పరిహారం చెల్లింపుల్లో జాప్యం కొనసాగుతోంది. ఏప్రిల్ నుంచి రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం అందలేదన్నారు. కరోనా కారణంగా ఏప్రిల్ నెలలో తెలంగాణ ప్రభుత్వం 83శాతం రెవెన్యూను కోల్పోయిందని.. అదే సమయంలో కరోనా కట్టడికి ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చిందని అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమే రుణం తీసుకుని పూర్తి స్థాయిలో రాష్ట్రాలకు పరిహారం చెల్లించాలని తన లేఖలో రాశారు కేసీఆర్.

రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలంటూ కేంద్రం చెప్పడం సరికాదన్నారు. కేంద్రానికి ఉన్న ఆర్థిక వెసులుబాటు రాష్ట్రాలకు లేదని.. ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాలకు అదనంగా సాయం చేయాల్సిన కేంద్రం ఈ విధంగా కోత విధించడం తగదన్నారు. కేంద్రం ప్రతిపాదనలు సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమనీ, జీఎస్టీ నిర్ణయాలు అన్నీ ఏకగ్రీవంగా తీసుకున్నవేనని విమర్శించారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం తగ్గించాలన్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story