సీఎం కేసీఆర్ సంతకం ఫోర్జరీ
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Aug 2020 4:38 AM GMTసీఎం కేసీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు ఓ ఘనుడు. వివరాళ్లోకెళితే.. కరీంనగర్ జిల్లాకు చెందిన చింటు అనే యువకుడు టీఆర్ఎస్‌లో కార్యకర్త. వాట్సప్ స్టేటస్ డీపీ, ఫేస్ బుక్ లో కేసీఆర్, కేటీఆర్ లతో దిగిన ఫొటోలు, తెలంగాణ స్టేట్- ఆల్ ఇండియా యాంటీ కరప్షన్ కమిటీ ఛైర్మన్, కరీంనగర్ జిల్లా టిఆర్ఎస్ యువజన కార్యదర్శి అంటూ పరిచయాలు పెంచుకుని మోసాలకు పాల్పడట్టు తెలుస్తోంది.
అమాయకులకు మాయమాటలు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ముగ్గులోకి దింపి.. ముఖ్యమంత్రి లెటర్ హెడ్ ఫోర్జరీ సంతకంతో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వసూళ్లకు పాల్పడ్డాడు. అలాగే.. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నాకు చాలా క్లోజ్ అనీ.. ఏం కావాలన్న పనులు చేస్తారంటూ చింటు జనాన్ని నమ్మించి మోసాలకు పాల్పడసాగాడు.
కాగా, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో దిగిన ఫోటోలతో అమాయకులకు గాలం వేస్తున్న చింటూ మాటలు నిజమేనని నమ్మిన జనం.. అతడి మాయలో పడ్డారు. అతని నిజస్వరూపం బయటపడటంతో.. సంతకం ఫోర్జరీ కేసులో చింటును అదుపులోకి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. చింటు వద్ద నుంచి నకిలీ లెటర్ ప్యాడ్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. చింటూ ఇదివరకే నకిలీ ఉత్తర్వులు తయారు చేశాడా అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు.