శ్రీశైలం అగ్నిప్రమాదంపై ప్రభుత్వం సీబీఐ విచారణ కోరాలి : బండి సంజయ్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Aug 2020 4:04 AM GMT
శ్రీశైలం అగ్నిప్రమాదంపై ప్రభుత్వం సీబీఐ విచారణ కోరాలి : బండి సంజయ్

శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజయ్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం సంభవించిందని‌ ఆరోపించారు. ప్రమాద ఘటనపై ఆయ‌న శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా.. శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ ప్రమాదంపై సీఐడీ విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయనే నమ్మకం లేదని.. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. ప్లాంటులో వేల కోట్ల రూపాయల ఆస్తిని కాపాడే ప్రయత్నంలోనే ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని.. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.2 కోట్ల పరిహారం ఇవ్వాలని కోరారు.

మంటలు మొదలవగానే బయటకు వస్తే.. ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయేవారు కాద‌నీ.. కానీ వారు అలా చేయలేదని.. సాహసోపేతంగా మంటలు ఆర్పుతుండటాన్ని దృశ్యాల్లో చూడవచ్చని.. పరిహారం చెల్లించడంలో ఉద్యోగుల హోదాను పరిగణలోకి తీసుకోకుండా.. మృతులందరి కుటుంబాలకు రూ. 2 కోట్ల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు.

ఇదిలావుంటే.. శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రంలో గురువారం అర్థరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ప్యానల్‌ బోర్డులో మంటలు చెలరేగి జలవిద్యుత్‌ కేంద్రం మొత్తం వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్‌ కేంద్రంలో 30 మంది సిబ్బంది ఉండగా.. 9 మంది మ‌ర‌ణించారు.

Next Story