శ్రీశైలం ప్రమాదంపై సీఐడీ విచారణకు సీఎం కేసీఆర్‌ ఆదేశం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Aug 2020 4:18 PM IST
శ్రీశైలం ప్రమాదంపై సీఐడీ విచారణకు సీఎం కేసీఆర్‌ ఆదేశం

శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిని అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా పేర్కొన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి చేసిన అన్ని ప్రయత్నాలు ఫలించకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబ సభ్యులకు, బంధువులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని, పూర్తి ప్రభుత్వ ఖర్చుతో వైద్యం చేయించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

అలాగే.. జరిగిన ప్రమాదంపై సీఐడీ విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు వెలికి తీయాలని, ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు బయటకు రావాలని సీఎం స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల మేరకు సీఐడీ అడిషనల్ డీజీపీ గోవింద్ సింగ్ ను విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

Next Story