ఆరు గంటల పాటు ఇద్దరు సీఎంలు భేటీ.. చర్చించిన కీలక అంశాలు ఇవే..

By సుభాష్  Published on  13 Jan 2020 9:29 PM IST
ఆరు గంటల పాటు ఇద్దరు సీఎంలు భేటీ.. చర్చించిన కీలక అంశాలు ఇవే..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కృష్ణానదిలో నీటి లభ్యతలో ప్రతి ఏడాది అనిశ్చి పరిస్థితులు ఎదురవుతున్నందున గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించే విషయంపై చర్చించారు. అలాగే 9,10వ షెడ్యూల్‌లోని అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు దాదాపు ఆరు గంటలపాటు పలు అంశాలపై చర్చించారు. స్థానిక రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు తరలించే విషయంలో ఇద్దరు సీఎంలు సుదీర్ఘంగా చర్చించారు. కృష్ణా నది ఆయకట్టులో ఉన్న రాయలసీమ, తెలంగాణలో మహబూబ్‌ నగర్‌, నల్గొండ జిల్లాల రైతులు నష్టపోతున్నారు. ఇందులో భాగంగానే ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.

Kcr, Jagan

ఇక గోదావరి నీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించాలి.. ఎలా వినియోగించుకోవాలి అనే విషయాలపై చర్చించారు. ఇక విభజన చట్టంలోని 9,10వ షెడ్యూల్‌లోని పలు అనవసర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు తమ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో ఫోన్లో మాట్లాడారు. 9,10వ షెడ్యూల్‌లోని అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించే దిశగా మరోసారి సమావేశం కావాలని ఆదేశించారు. ఇక జగన్‌ వెంట ఎంపీ విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, ప్రభాకర్‌ రెడ్డి ఉన్నారు. ఇక జగన్‌కు స్వాగతం పలికిన వారిలో మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌ కుమార్‌ ఉన్నారు.

Next Story