పాదయాత్రలో వారి సమస్యలు చూశా : సీఎం జగన్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 July 2020 5:10 PM IST
పాదయాత్రలో వారి సమస్యలు చూశా : సీఎం జగన్‌

ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌ (ఆప్కాస్‌)ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించిన ఆయన సుమారు 50వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వ్యవస్థలో మార్పు తెచ్చేందుకే ఔట్ సోర్సింగ్‌ కార్పోరేషన్‌ ప్రారంభించనట్లు చెప్పారు. పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగుల సమస్యలు పాదయాత్రలో చూశాననని తెలిపారు. గతంలో కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే ఔట్ సోర్సింగ్‌ ఉద్యోగాలను తీసుకొచ్చారని, దీని వల్ల ఉద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. గత ప్రభుత్వం వారిని నిలువునా దోచుకుందని, దీనిని రూపుమాపాలని ఆప్కాస్‌ను రూపొందించామని తెలిపారు.

మహిళలకూ 50 శాతం ఉద్యోగాలు దక్కే విధంగా దీనిని అమలు చేస్తామన్నారు. కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌కు చైర్మన్‌గా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కి చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి లేదా ప్రభుత్వ కార్యదర్శి వ్యవహరిస్తారు. దీంతో ఎక్కడా కూడా అవినీతి చోటుచేసుకునే అవకాశం ఉండదని పేర్కొన్నారు. జీతాలు, ఉద్యోగాల్లో ఎక్కడా చేతివాటాలకు అస్కారం లేదన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత ఉంటుందని, ప్రతి ఒకనెలా 1వ తేదీనే జీతాలు చెల్లిస్తామన్నారు. ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి విధానాలు కచ్చితంగా పాటిస్తామన్నారు.

రాబోయే రోజుల్లో మిగిలిన విభాగాలు అప్కోస్‌తో అనుసందానం చేసి ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ప్రస్తుతానికి 50,449 మందికి నియామక పత్రాలు ఇస్తున్నామన్నారు. గతంలో 20 మంది అవసరం అయిన చోట 15 మందినే నియమించి.. మిగిలిన వారి సొమ్మును కాంట్రాక్టర్లు తమ జేబుల్లో వేసుకొనేవాళ్లన్నారు. ఇకపై సిఫారసులు, దళారీలకు చోటు లేదని, కాంట్రాక్టు ఉద్యోగులు వారు పనిచేసే విధానం బట్టి ఉద్యోగ భద్రత ఆధారపడి ఉంటుందన్నారు.

Next Story