కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీకి చెందిన ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆమె మంగళసూత్రానికి బదులుగా శిలువ ధరించింది.
ట్విట్టర్ యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ 'మంగళసూత్రం ఉండాల్సిన స్థానంలో శిలువ ఉంది. జన్యుధారి దత్తాత్రేయ బ్రాహ్మణుడైన వ్యక్తి సోదరి ఇలా శిలువ ధరించి ఉంది. ఆమె మాత్రం తాను గంగ కూతురిని చెప్పుకుంటూ ఉంటుంది.(కుటుంబం మొత్తం అబద్ధాలు చెబుతూ ఉంటుంది)' అని ట్వీట్ చేశారు.

నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టు 'పచ్చి అబద్ధం'.
న్యూస్ మీటర్ ఈ ఘటనపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఒరిజినల్ ఫోటో ‘First Post‘ లో ప్రచురించారు. ప్రియాంక గాంధీ ఇదే డ్రెస్ ను వేసుకుని ఉండగా.. ఒరిజినల్ ఫోటోలో ఆమె శిలువ ధరించి లేదు. ఆమె తన మెడలో వేసుకున్న చైన్ ను మార్ఫింగ్ చేసి శిలువగా మార్చారు.

ఈ ఫోటోను 2017 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తీశారు. “UP Election 2017: Rahul’s Raebareli rally falls flat, but Priyanka Gandhi saves the day for Congress” అంటూ వార్తాకథనాలను ప్రచురించారు. ఈ ప్రచారంలో తీసిన ఫోటోల్లో ఎక్కడా కూడా ప్రియాంక గాంధీ శిలువను ధరించి కనిపించలేదు.
‘Huffington Post India‘ కథనంలో కూడా ఒరిజినల్ ఫోటోను పోస్టు చేశారు. ఫోటోగ్రాఫర్ సంజయ్ కనోజియా ఈ ఫోటోను తీశారు. ఈ ఫోటోల్లో కూడా ఆమె వేరే చైన్ ను ధరించారు కానీ శిలువ ధరించలేదు. సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులను పూర్తిగా ఎడిట్ చేసినట్లు భావించవచ్చు. మార్ఫింగ్ చేసి ఆమె శిలువ ధరించినట్లుగా ఫోటోలు పెట్టి వైరల్ చేశారు.

ఒరిజినల్ ఫోటోకు, వైరల్ ఫోటోకు ఉన్న తేడాలను గమనించవచ్చు
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.