Fact Check : 'ఠాకూర్లు కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తూ ఉంటారు' అని యోగి ఆదిత్యనాథ్ అన్నారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Oct 2020 7:05 AM GMT
Fact Check : ఠాకూర్లు కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తూ ఉంటారు అని యోగి ఆదిత్యనాథ్ అన్నారా..?

హిందీ న్యూస్ ఛానల్ 'ఆజ్ తక్' న్యూస్ బులిటెన్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ 'ఠాకూర్ల రక్తం మరుగుతూ ఉంటుంది.. వాళ్ళు కూడా తప్పులు చేస్తూ ఉంటారు' అనే వ్యాఖ్యలు చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ చేస్తూ ఉన్నారు. హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తూ ఉన్నారు.

Yogi

ట్విట్టర్ లో కూడా ఈ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు నిజంగా సిగ్గు చేటు అని పలువురు ఈ స్క్రీన్ షాట్ ను షేర్ చేశారు.

Y2

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టులో 'ఎటువంటి నిజం లేదు'.

న్యూస్ మీటర్ ఈ వ్యాఖ్యలపై ఇతర వార్తా సంస్థల్లో కూడా వెతకగా.. యోగి ఆదిత్యనాథ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు ఎక్కడ కూడా రాలేదు. యోగి ఆదిత్య నాథ్ ట్విట్టర్ ఖాతాలో కూడా ఎటువంటి పోస్టులు కూడా పెట్టలేదు.

ఆజ్ తక్ వార్తా సంస్థ లో కూడా ఇటువంటి కథనాలు రాలేదు. ఆజ్ తక్ వెబ్సైట్, సోషల్ మీడియా పేజీలను వెతికినప్పటికీ ఎటువంటి వార్త కూడా లేదు. ఇక ఒరిజినల్ స్క్రీన్ షాట్ విషయానికి వస్తే యోగి ఆదిత్యనాథ్ కూర్చుని ఉన్న ఫోటో ఆయన ట్విట్టర్ అకౌంట్ లో చూడొచ్చు. యోగి ఆదిత్య నాథ్ ఎస్పీ, డీఎస్పీలను సస్పెండ్ చేసిన కథనాలను కూడా గమనించవచ్చు. కానీ ఈ ఫోటోను ఎవరో కావాలనే ఎడిట్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

హత్రాస్ ఘటనలో మరణానికి కారకులైన వారిగా భావిస్తున్న నలుగురు యువకులు అమాయకులని అంటున్నారు కొందరు. వారిని అన్యాయంగా కేసులో ఇరికించారని.. ఆ నిందితుల సామాజికవర్గానికి చెందిన పలువురు చెబుతున్నారు. యువతిపై అత్యాచారం జరుగలేదని ఫోరెన్సిక్‌ నివేదికలో పేర్కొనడంతో నిందితులకు న్యాయం చేయాలని కోరుతూ ఉన్నారు. ఆదివారం ఓ నిందితుడి కుటుంబం సహా అగ్రకులాలకు చెందిన 500 మందికిపైగా వ్యక్తులు హత్రాస్‌ గ్రామానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న స్థానిక బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాజ్‌వీర్‌సింగ్‌ పహిల్వాన్‌ ఇంట్లో సమావేశమయ్యారు.

సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సీబీఐ విచారణకు ఆదేశించిన మరుసటి రోజే ఈ సమావేశం జరిగింది. పోలీసుల అనుమతి తోనే నిర్వహించారు. రాజ్‌వీర్‌సింగ్‌ పహిల్వాన్‌ కుమారుడు మన్‌వీర్‌ మీడియాతో మాట్లాడుతూ.. నిందితులు ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నారని.. బాలిక కుటుంబమే మాటపై నిలబడటం లేదని చెప్పుకొచ్చారు. అగ్రకులాల వారే కాకుండా, సమాజం లోని అన్ని వర్గాల వారు ఈ సమావేశానికి వచ్చారన్నారు. బాధిత కుటుంబ సభ్యులపైనా కేసు నమోదు చేయాలని ఆ సమావేశంలో డిమాండ్‌ చేశారు. ఘటనకు సంబంధించి బాధిత కుటుంబం పలుమార్లు తమ స్టేట్‌మెంట్‌ను మార్చారని ఆరోపించారు. ఠాకూర్‌ కుటుంబానికి చెందిన నలుగురు యువకులు దారుణంగా దాడి చేయడం వల్ల దళిత యువతి మరణించినట్లు తెలుస్తోంది. వారి వల్ల అత్యాచారానికి గురైనట్లు ఆధారాలు లేవని, ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబరేటరీ నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర అదనపు డీజీపీ ప్రశాంత కుమార్ తెలిపారు.

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఉన్న వ్యాఖ్యలను యోగి ఆదిత్యనాథ్ ఎప్పుడూ చెప్పలేదు. ఆ స్క్రీన్ షాట్ ను చూస్తే పక్కాగా ఎడిట్ చేసినట్లు కనిపిస్తోంది. ఆజ్ తక్ లో వచ్చే బ్రేకింగ్ టెక్స్ట్ కు దీనికి కూడా ఎంతో తేడా ఉందని స్పష్టమవుతోంది. బ్రేకింగ్ బాక్స్ లో ఉన్న రంగుల్లో మార్పులను చూస్తే అది మార్ఫింగ్ చేసినట్లు అర్థమవుతోంది.

కాబట్టి.. ఈ వైరల్ పోస్టులు 'పచ్చి అబద్ధం'.

Claim Review:Fact Check : 'ఠాకూర్లు కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తూ ఉంటారు' అని యోగి ఆదిత్యనాథ్ అన్నారా..?
Claim Reviewed By:Misha Rajani
Claim Fact Check:false
Next Story