పౌర‌స‌త్వం బిల్లుపై వివాదం... సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన యూఎస్ క‌మిష‌న్‌

By సుభాష్  Published on  10 Dec 2019 4:51 PM IST
పౌర‌స‌త్వం బిల్లుపై వివాదం... సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన యూఎస్ క‌మిష‌న్‌

ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిషష్టాత్మకంగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లుపై యూఎస్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇంటర్‌నేషన్‌ రిలీజియన్‌ ఫ్రీడమ్‌ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌) స్పందించింది. ఈ బిల్లును పౌరుల ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉందంటూ తీవ్రంగా వ్య‌తిరేకించింది. కేంద్ర స‌ర్కార్‌ ప్రవేశపెట్టిన ఈ బిల్లును తప్పుడు దిశగా వెళ్తుంద‌ని అభివ‌ర్ణించింది. ఒకవేళ ఈ బిల్లు పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఆమోదం పొందింతే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో పాటు కీలక నేతలపై ఆంక్షలను పరిశీలించాలని సూచించింది. ఘనమైన చరిత్ర కలిగిన భారతదేశంలో.. మత ప్రతిపాదికన విభజన జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా ఇటీవల అస్సాంలో అమలు చేసిన ఎన్‌ఆర్సీపై కూడా యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ స్పందించిన విషయం తెలిసిందే. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎన్‌ఆర్సీని రూపొందించారని యూఎస్‌సీఐఆర్ ఎఫ్‌ అభిప్రాయపడింది.

వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ బిల్లుపై దాదాపు 12 గంట‌ల పాటు త‌వ్ర వాదోప‌వాదాలు జ‌రిగాయి. దీంతో మూడు పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపిన‌ట్లు అయింది. ఈశాన్య ప్రాంత ప్రజల సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉందని అమిత్ షా పేర్కొన్నారు.ఈ బిల్లు ప‌రిధిలో లేని ఇన్న‌ర్ లైన్ ప‌ర్మిట్ ప్రాంతంలోకి మ‌ణిపూర్‌ను కూడా చేర్చ‌నున్న‌ట్లు చెప్పారు. మూడు పొరుగుదేశాల్లో మత వేధింపులను ఎదుర్కొన్న ముస్లిమేతరులకు రేషన్‌ కార్డ్‌ సహా ఎలాంటి పత్రాలు లేనప్పటికీ.. భారతీయ పౌరసత్వం కల్పిస్తామని పేర్కొన్నారు. ముస్లింలకు ఈ బిల్లు ఏ మాత్రం వ్యతిరేకం కాదని షా స్పష్టం చేశారు.

Next Story