పేద రైతు నాగేశ్వరరావు బ్యాక్ గ్రౌండ్ ఏమిటి?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 July 2020 1:05 PM IST
పేద రైతు నాగేశ్వరరావు బ్యాక్ గ్రౌండ్ ఏమిటి?

కంటికి కనిపించేవన్ని నిజాలు కావు. లోతుల్లోకి వెళ్లే కొద్దీ కొత్త విషయాలు బయటకు వస్తూనే ఉంటాయి. తాజాగా ఇదే విషయం చిత్తూరుజిల్లా పేద రైతుగా తొలుత సోషల్ మీడియాలో హైలెట్అయి.. అంతలోనే.. వెరీ.. వెరీ.. లక్కీ ఫెలో అంటూ విమర్శలకు గురైన నాగేశ్వరరావు ఎవరు? ఆయన ఆర్థిక పరిస్థితి ఏమిటి? అన్నదిప్పుడు కన్ఫ్యూజన్ గా మారింది. అన్నింటికి మించి.. ఆయన లోక్ సత్తా పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన నేతగా సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపులోనే ప్రచారం ఎక్కువైంది. అసలు నిజం ఏమిటి? సినీ నటుడు సోనూసూద్ ఆయనకు ట్రాక్టర్ పంపిన నేపథ్యంలో నిజంగానే ఆయన లక్కీ ఫెలోనా? ట్రాక్టర్ సాయం పొందే అర్హత ఆయనకు లేదా? అన్న లోతుల్లోకి ఒక ప్రాంతీయ మీడియా సంస్థ ప్రయత్నం చేసింది. ఆ సందర్భంగా వారు కొన్ని కీలక అంశాల్ని గుర్తించారు. అవేమంటే..

పొలంలో తన ఇద్దరు కుమార్తెల్ని కాడి ఎద్దులుగా దున్నిస్తున్న వైనానికి సంబంధించిన ఫోటోలు.. వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.జాతీయ మీడియా సైతం ఆసక్తిని ప్రదర్శించింది. దానికి స్పందనగా సినీ నటుడు సోనూ సూద్ ఆఘమేఘాల మీద ట్రాక్టర్ ను బహుమతిగా పంపారు. దీనికి స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు సోనూ సూద్ కు స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.

ఇదంతా ఓపక్క జరుగుతుంటే.. మరోపక్క నాగేశ్వరరావు ఆర్థికంగా శక్తివంతుడని.. ఆయన సరదాగా తీసుకున్న ఫోటోల్ని.. వీడియోల్ని సోషల్ మీడియాలో ప్రచారానికి పెట్టి.. ఏదో ప్రయోజనానికి ఆశించినట్లుగా వార్తలు వస్తున్నాయి. నిజంగానే ఆయన ఆపని చేశారన్న ప్రశ్నకు సమాధానం చెబితే నిజం కాదనే చెప్పాలి. ఇంతకీ నాగేశ్వరరావు సొంతూరు చిత్తూరు జిల్లా కేవీ పల్లె మండలం మహల్ రాజ్ పల్లె. ప్రభుత్వం ఇచ్చిన పక్కా ఇల్లు.. పూర్వీకుల నుంచి వస్తున్న రెండు ఎకరాల మెట్ట తప్పించి ఇతర ఆస్తుల్లేవు.

విద్యావంతుడైన నాగేశ్వరరావు తొలుత తండ్రికి చేదోడు వాదోడుగా ఉండి వ్యవసాయం చేసేవారు. తర్వాతి కాలంలో విప్లవ భావాలకు ఆకర్షితుడై.. మదనపల్లె కేంద్రంగా పౌరహక్కుల కార్యకర్తగా పని చేస్తున్నారు. పోలీసుల వేధింపుల్ని ఎదుర్కొన్నారు. ఒక ఆసుపత్రికి పీఆర్వోగా వ్యవహరించారు. తర్వాతి కాలంలో మదనపల్లెలో టీ స్టాల్ పెట్టుకున్నారు. అక్కడే చిన్న ఇంట్లో ఉంటున్నారు.

లాక్ డౌన్ నేపథ్యంలో షాపు మూతపడటంతో.. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. చాలామంది మాదిరే సొంతూరుకు పయనమయ్యారు. బీడుగా ఉన్న రెండుఎకరాల భూమిలో కొంత మేర వ్యవసాయం చేయాలని.. కందులు వేయాలని డిసైడ్ అయ్యాడు. కూతుళ్లు కాడి లాగుతుంటే.. భార్య విత్తనాలు చల్లుతూ.. కుటుంబం మొత్తం కష్టపడి పని చేయసాగారు. వీరి చేస్తున్న పనిని గమనించిన బంధువు ఒకరు సరదాగా వీడియో తీసి.. తన బంధువులకు వాట్సాప్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలోకి రావటంతో అదో సంచలనంగా మారింది.

దీంతో ఏపీ సర్కారు విచారణ చేపట్టింది. రైతు పరిస్థితి విచారించి నివేదిక అందించాలని సీఎంవోను నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వం నుంచి వివిధ పథకాల కింద లబ్థి పొందటానికి నాగేశ్వరరావు కుటుంబం అర్హమైనదే. అందరి పేదలు.. దళితులకు అందే సాయమే వీరికి అందుతోంది. ఎప్పుడైతే.. సోషల్ మీడియాలో వైరల్ అయి సోనూ సూద్ స్పందించి ట్రాక్టర్ బహుమతిగా పంపటం.. ఆయన చర్యను చంద్రబాబు అభినందించారో అప్పటి నుంచి సోషల్ మీడియాలో నాగేశ్వరరావు మీద సరికొత్త ప్రచారం మొదలైంది. లక్కీ ఫెలో అంటూ వాదనలు వినిపించటం షురూ అయ్యాయి. ఇవి .. ఆ కుటుంబానికి తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి.

సోషల్ మీడియాలో వస్తున్నట్లుగా తాను ఆర్థికంగా సంపన్నుడ్ని కాదని ఆయన చెబుతున్నారు. అంతేకాదు.. లోక్ సత్తా తరఫున అభ్యర్థిగా పోటీ చేసిన మాట వాస్తవమని.. కాకుంటే అప్పట్లో అభ్యర్థి ఒకరు చివరి క్షణంలో వెనక్కి తగ్గటంతో తనకు అవకాశం లభించిందే తప్పించి.. తాను సొంతంగా ప్రయత్నం చేసి తెచ్చుకున్నది కాదన్నారు. పౌరహక్కుల ఉద్యమంలో జిల్లా కార్యదర్శిగా ఉన్న తన ఆర్థిక పరిస్థితి మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవారు.. ఒకసారి తన ఇంటికి వచ్చి చూస్తే.. అన్ని విషయాలు అర్థమవుతాయన్న ఆయన ఆవేదనను అర్థం చేసుకోవచ్చు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని.. తనపై దుష్ప్రచారం చేసేవారు అన్ని వాస్తవాల్ని గుర్తించిన తర్వాత మాట అంటే బాగుంటుందని చెబుతున్నారు. నిజమే.. మాట పడే వారికి ఆ మాత్రం ఆవేదన కలగటాన్ని అర్థం చేసుకోవచ్చు.

Next Story