పెద్ద సాయం.. విమర్శల మయం..!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  27 July 2020 3:38 PM GMT
పెద్ద సాయం.. విమర్శల మయం..!

  • నాగేశ్వరరావు రైతే కాదు
  • సోనుసూద్‌ పెద్ద మనసు
  • చుట్టుపక్కల వారి విమర్శలు
  • ‘కాడిలాగిన’ ఘటనలో ట్విస్టులు

పొలం దున్నడానికి ఎద్దులు అద్దెకు తెచ్చుకోలేని దుస్థితిలో, ఎదిగిన కూతుళ్లే కాడి లాగిన ఘటన సంచలనం రేకెత్తించింది. చిత్తూరు జిల్లా మహల్రాజు పల్లెకు చెందిన బడుగు రైతు నాగేశ్వరరావుకు నటుడు సోనుసూద్‌ నుంచి ట్రాక్టర్‌ సాయంగా వచ్చింది. దీంతో నాగేశ్వరరావు ఘాటైన విమర్శలు ఎదుర్కోవల్సి వచ్చింది. తనని రైతే కాదని కొందరన్నారు. అంత పేదేం కాదు ఆర్థికంగా పరవాలేదు అని ఇంకొందరు అంటే...మరికొందరు నాగేశ్వరరావు గురించి ఏకంగా ప్రభుత్వాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇలా గంటకో మలుపు తిరిగిన ఆసక్తి కర ఘటన వివరాలివీ..

ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా సోషల్‌ మీడియా, టీవీల్లో విపరీతంగా వైరల్‌ అయిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలోని ఓ పల్లెలో పేదరైతు పొలం సాగుకు తన కూతుళ్ళే కాడి లాగడం. ఈ ఘటన నిజంగా నెటిజన్ల, టీవీ ప్రేక్షకుల గుండెను పిండేసింది. కరోనా కష్టకాలంలో ఎలాంటి దుస్థితి ఎదుర్కొంటున్నారు కదా అని చెమర్చిన కళ్లతో జాలి కురిపించారు. ఈ వార్త ట్విటర్‌ ద్వరా విలక్షణ నటుడు సోనుసూద్‌కు చేరింది. వయసులోని అమ్మాయిలు పొలంలో చెమటోడ్చి కాడి లాగడం చూశాక మనసు చలించిపోయింది. ఆ పేద రైతు దుస్థితి కన్నా వారి చదువు అర్ధాంతరంగా ఎక్కడ ఆగిపోతుందోనన్న బెంగతో వారికి ఎడ్ల సాయం చేస్తున్నట్టు ట్వీట్‌ చేశాడు.

కానీ అది తాత్కాలిక ఉపశమనమే అని భావించి మరి కొద్ది సేపటికే కాదు కాదు వీరికి ఎడ్లు కాదు ట్రాక్టర్‌ కావాలి. సోమవారానికల్లా వారి ఇంటి ముందు ఉంటుంది. అప్పుడే కుటుంబం ఆర్థికంగా కాస్త మెరుగవుతుంది. ఆ అమ్మాయిలు పొలానికి కాకుండా కాలేజీకి వెళ్లే అవకాశం దొరుకుతుందని మళ్ళీ ట్వీట్‌ చేశాడు. ఆదివారం రాత్రికే అంటే కొన్ని గంటల వ్యవధిలోనే ట్రాక్టర్‌ నాగేశ్వరరావు ఇంటికి చేరుకుంది. అనుకోని ఈ పెద్ద సాయానికి ఆ కుటుంబం ఉబ్బితబ్బిబ్బయ్యింది. గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. అయితే కథ ఇక్కడితో ఆగిపోలేదు. తెల్లారే సరికి కొత్త మలుపు తిరిగింది.

నాగేశ్వరరావు ఎస్‌.సి. సామాజికవర్గానికి చెందినవారు. అతని తండ్రి రామయ్యకు ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1.57 సెంట్ల భూమిని ప్రభుత్వం పంపిణీ చేసింది. ప్రస్తుతం ఆ భూమినే సాగు చేసుకుంటున్నట్లు నాగేశ్వరరావు చెప్పారు. తనకంటూ సొంత ఇల్లు లేదు. గతంలో లోక్‌సత్తా పార్టీ నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం జిల్లా పౌరహక్కుల సంఘం కార్యదర్శిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే సోనుసూద్‌ నుంచి ట్రాక్టర్‌ సాయం అందుకోగానే నాగేశ్వరరావు అందరికంట్లో పడ్డాడు.

ఈ ఘటనపై పలువురు పలు రకాలుగా చర్చించుకున్నారు. ‘ వాళ్లు సరదాగా చేసిన పని వైరల్‌ అయిందని, నటుడు సోనుసూద్‌ ట్వీట్‌ తర్వాత ఆ రైతుకు అవసరమైన సాయం అందించాల్సిందిగా సీఎం కార్యాలయం నుంచి స్థానిక ఎంపీడీవోకు సమాచారం వెళ్లింది. ఎంపీడీవో, ఎమ్మార్వోలు ఆ ఊరికి వెళ్ళి విచారించగా సరదాగా చేసిన వ్యవహారమని తెలిసిందన్న వార్త విస్తృతంగా వ్యాపించింది. దీంతోపాటు పలు ప్రభుత్వ పథకాల కింద నాగేశ్వరావు కుటుంబానికి సాయం అందుతోందని కొందరు చెబుతున్నారు.

పైగా నాగేశ్వరరావు మదనపల్లె పట్టణంలో టీకొట్టు పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడని అతను రైతు ఎలా అవుతాడని, కరోనా రావడంతో మదనపల్లి వదలి పల్లెకు వచ్చాడని మరి కొందరు అంటున్నారు. ఈ విషయంగా అధికారుల దాకా వెళ్ళడంతో నాగేశ్వరరావు కుటుంబ స్థితిగతుల్ని పరిశీలించి ఉన్నతాధికారులకు ఓనివేదిక ఇవ్వడానికి స్థానికాధికారులు సిద్ధమయ్యారు. అయితే తనపై అనూహ్యంగా వస్తున్న విమర్శలకు నాగేశ్వర్రావు ఓ ఛానెల్‌కు సమాధానం ఇచ్చారు.

‘నేను రైతా కాదా అనేది పక్కన పెడితే. నాకు మా తండ్రి నుంచి దక్కిన 1.57ఎకరాల పొలం ఉంది. అయితే ఇది పూర్తిగా వర్షాధారం. చినుకులు పడితే పంట లేదంటే కడుపు మంట. అదీ మా స్థితి. నాకు పెళ్లయ్యాక పొలం ద్వారా పూర్తిస్థాయిలో ఆర్థికంగా బతకలేనని భావించి కుటుంబాన్ని మదనపల్లికి మార్చాను. అక్కడ అద్దె ఇంట్లో ఉంటూ, టీకొట్టు పెట్టుకున్నాను. అయితే ఏడాదికోసారి వర్షాకాలం రాగానే పొలం సాగు చేయడానికి ఇంటిల్లిపాది వస్తాం. సాగు చేసి అమ్మానాన్నలకు సాయంగా ఉండేవాళ్లం. వ్యవసాయాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. ఈ కరోనాతో మదనపల్లిలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. దాదాపు నాలుగు నెలలుగా కొట్టు మూసేసి ఉన్నాం. మళ్లీ పరిస్థితి మామూలవుతుందనే ఆశతో బతికాము. కానీ రోజురోజుకూ కష్టాలు పెరిగాయే కానీ తగ్గలేదు. నాలుగు నెలలుగా ఇంటి అద్దెకూడా చెల్లించలేక పోయాను.

ఇక అక్కడుండటం ఎందుకని పల్లెకు వచ్చాము. పల్లెలో అందరూ విత్తనాలు వేస్తుంటే.. నేను కూడా అప్పో సప్పో చేసుకుని సెనగిత్తనాలు తెచ్చాను. పొలం సాగు కోసం ఎడ్లను అద్దె అడిగితే రోజుకు 2 వేలన్నారు. ఎక్కడ్నుంచి తేవాలి? పోనీ ట్రాక్టర్‌ చూద్దామంటే అది గంటకు 1500 అద్దె కట్టాలి. కుదిరే పని కాదని ఆశలు వదిలేసుకున్నాను. కానీ నా పిల్లలు అలా వదిలేస్తే ఎలా నాన్.. మేమున్నాం కాడిలాగేందుకు ఎలాగోలా విత్తనాలు వేద్దామని బలవంతం చేస్తే పొలంలో దిగాము. నేను కాడి పట్టుకుంటే పిల్లలు లాగారు. నా భార్య విత్తనాలు వేసింది. ఇందులో అబద్ధమేముంది? నా దగ్గరున్న పాసు పుస్తకాలు చూస్తే నేను రైతు అవునో కాదో తెలుస్తుంది’ అని చెప్పారు.

‘పొలం సాగు చేసి విత్తనాలు వేయకపోతే ప్రభత్వం నుంచి రైతుభరోసా సాయం అందదన్న ప్రచారంతో ఆలోచనలోపడ్డా. గతంలో ఏడువేలు పడింది. ఇక ఆ సాయం రాదేమో అన్న భయంతో సాగుకు సిద్ధమయ్యా. ఇది సరదా కోసం చేసిందెట్లవుతుంది. మేము వ్యవసాయాన్ని శ్రద్ధతోనే చేస్తున్నాం. ఈ పుకార్ల నేపథ్యంలో ఎమ్మార్వో ఎంపీడీవోలు ఇంటికొచ్చారు. వారికి నా దగ్గరున్న పొలం పత్రాలు, పాసుపుస్తకాలు చూపించాను. అమ్మానాన్నల పింఛనే మాకు ఆధారం అని వివరించాను. ఒకే ఒక్క గదిలో ఆరుగురం బతుకుతున్నాం. ఎమ్మార్వో మా కుటుంబ స్థితిలో వాస్తవాలను గమనించారు.

అయితే ఎంపీడీవో మాత్రం పలురకాలుగా ప్రశ్నించారు. మదనపల్లిలో ఉంటావంటా, రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నావంట, ఎమ్మెల్యేగా పోటీ చేశావంట, కూతుర్ని డాక్టరు చదివించాలనుకుంటున్నావట... మరి నువ్వు పేద రైతు ఎలా అవుతావని ప్రశ్నలు గుప్పించారు. మా కష్టం చూసి మనసున్న మారాజు ఓ సినిమా సారు సాయం అందిస్తుంటే మిగిలినవారు ఎందుకింత అసంతృప్తిగా ఉంటున్నారో నాకైతే తెలీదు...’ అని నాగేశ్వరరావు వివరించారు.

మొత్తానికి సోనుసూద్‌ పేదరైతుకు ట్రాక్టర్‌ సాయమందించిన సంఘటన ఇక్కడితో ఆగుతుందా...మరిన్ని మలుపులు తిరుగుతాయా అన్నది వేచి చూడాల్సిందే!!

Next Story
Share it