అపహరించిన ఐదుగురు భారతీయులను అప్పగించిన చైనా
By తోట వంశీ కుమార్ Published on 12 Sept 2020 1:21 PM ISTఅపహరణకు గురైన అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు యువకులని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పిఎల్‌ఎ) భారత్‌కు అప్పగించింది. ఈ అప్పగింత (హ్యాండ్ ఓవర్) చైనా భూభాగంలో జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి గంట సమయం పట్టే చైనా భూభాగంలోకి ఈ ఐదుగురు సెప్టెంబర్ 1 పొరపాటున వెళ్లారు. వారి కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని భారత ఆర్మీ అధికారులకు తెలిపారు. వెంటనే స్పందించిన అధికారులు చైనా ఆర్మీతో సంప్రదింపులు జరిపారు.
కాగా, ఇండో టిబెటన్ భద్రతా దళాలు స్థానికులను సహాయకులుగా వినియోగించుకుంటాయి. వారితో తమకు అవసరమైన సామగ్రిని తెప్పించుకుంటాయి. ఈ నేపథ్యంలోనే అరుణాచల్ ప్రదేశ్‌లో సుబన్‌సిరి జిల్లాకు చెందిన ఐదుగురు దారి తప్పిపోయారు. సరిహద్దుల వెంట వారిని చైనా సైన్యం అపహరించింది. మొదట తమకు వారి జాడ గురించి తెలియదన్న చైనా అనంతరం వారు తమ వద్దే ఉన్నట్లు ప్రకటించింది.
కాగా.. ఇటీవల తప్పిపోయి భారత భూభాగంలోకి వచ్చిన చైనీయుల పట్ల భారత రక్షణ దళాలు మానవతా దృష్టితో వ్యవహరించటమే కాకుండా.. వారికి వెచ్చని దుస్తులు, ఆహారం అందించి మరీ తిరిగి వెళ్లేందుకు దారి చూపించిన సంగతి తెలిసిందే.