కన్నడ నాట డ్రగ్స్ కలకలం అంతకంతకూ ముదురుతోంది. ఓవైపు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు డ్రగ్స్ దగ్గర ఆగితే.. కర్ణాటక సినీ రంగానికి చెందిన పలువురు డ్రగ్స్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే డ్రగ్స్ అక్రమ రవాణా విషయంలో ఇద్దరు నటీమణులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. మంగళూరుకు చెందిన ప్రతీక్ శెట్టి అనే ప్రముఖ డ్రగ్ పెడ్లర్ ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.

ఇప్పటికే అరెస్టు చేసిన నటి సంజనను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఈ సందర్భంగా ఆమె.. బెంగళూరు మహానగరంలో తనకు పది ప్లాట్లు ఉన్న విషయాన్ని అంగీకరించారు. అంతేకాదు.. ఆమెకు చెందిన పది ప్లాట్లకు కన్నడ సినీ రంగానికి చెందిన పలువురు నటులు.. సంగీతదర్శకులు వచ్చి వెళ్లేవారన్న వాదన వినిపిస్తోంది. ఈ కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

నటి సంజనాకు చెందిన ప్లాట్లకు వెళ్లిన సినీ ప్రముఖులు ఇప్పుడు ప్రముఖ లాయర్లను సంప్రదిస్తున్నట్లు చెబుతున్నారు. సంజనా ప్లాట్లకు వెళ్లినట్లుగా సమాచారం బయటకు పొక్కటంతో.. తమ పేర్లు బయటకు వస్తే తామేం చేయాలన్న విషయంపై వారు కిందామీదా పడుతున్నట్లుగా తెలుస్తోంది. పలువురు ప్రముఖులు తమను కేసు చిక్కుల నుంచి బయటపడేయాలంటూ రాజకీయ నేతల మీద ఒత్తిడి తెస్తున్నట్లుగా చెబుతున్నారు.

మరోవైపు ఇదే అంశంపై అరెస్టు అయిన మరో నటి రాగిణి బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు. తాజాగా 33వ సీసీహెచ్ కోర్టులో బెయిల్ పై వాదనలు జోరుగా సాగాయి. మరిన్ని వివరాలు ఆమె నుంచి సేకరించాల్సిన అవసరం ఉండటంతో ఆమె పిటిషన్ పై నిర్ణయం తీసుకోకుండా కేసు విచారణను వాయిదా వేశారు. డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నటీమణులు రాగిణి.. సంజనల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లుగా తెలుస్తోంది. పలువురు సినీ.. రాజకీయ రంగానికి చెందిన వారితో పాటు.. బిజినెస్ ప్రముఖులకు కూడా ఇందులో లింకు ఉందన్న మాట వినిపిస్తోంది. మొత్తానికి డ్రగ్స్ వ్యవహారం శాండల్ వుడ్ నే కాదు.. ఇప్పుడు హోల్ కర్ణాటకను ప్రభావితం చేస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాలకు కారణమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *