డ్రగ్స్‌ కేసులో రకుల్‌, సారా పేర్లు చెప్పిన రియా..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Sep 2020 5:38 AM GMT
డ్రగ్స్‌ కేసులో రకుల్‌, సారా పేర్లు చెప్పిన రియా..!

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి కేసు విచారణ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. సుశాంత్‌కు రియా డ్రగ్స్‌ ఇచ్చింది అంటూ ఆరోపణలు రావడంతో అధికారులు ఆ దిశగా విచారణ జరిపారు. డ్రగ్స్‌ కోణంలో దర్యాప్తు చేస్తున్న నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ).. రియాకు డ్రగ్స్ తో సంబంధం ఉన్నట్టు తేలడంతో ఇటీవల రియా చక్రవర్తితో పాటు ఆమె సోదరుడు షోవిక్‌, శామ్యూల్‌ మెరిండాతో పాటు మరికొంత మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉన్నతాధికారుల విచారణలో రియా పలు సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రియా డ్రగ్స్ తీసుకునే వారి పేర్లను ఎన్‌సీబీ అదికారులకు తెలిపింది.

వారిలో టాలీవుడ్ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉంది. అంతే కాకుండా సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ ,రణవీర్ సింగ్ స్నేహితురాలి పేర్లను వెల్లడించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రియా చెప్పిన వ్యక్తులను త్వరలోనే విచారించేందుకు అధికారులు సిద్దమవుతున్నట్లు సమాచారం. రియా, ఆమె సోదరుడు షోవిక్‌ ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. రియాతో పాటు ఆమె సోదరుడు, మరో నలుగురు పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్లను ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తిరస్కరించింది. వీరి పిటిషన్లపై నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ అండ్, సైకోట్రాపిక్‌ సబ్‌స్టాన్సెస్‌(ఎన్‌డీపీఎస్‌) చట్టం ప్రత్యేక కోర్టు జడ్జి జీబీ గురావ్‌ విచారణ చేపట్టారు.డ్రగ్స్‌ కేసులో రకుల్‌, సారా పేర్లు ఉన్నట్లు వార్తలు వస్తుండడంతో నెటీజన్లు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. సారా అలీఖాన్‌ చిత్రాలను బాయ్‌కాట్‌ చేయాలంటూ ట్వీట్లు పెడుతున్నారు.

Next Story