భారత్ ను మూడు వైపులా కమ్ముకుంటున్న డ్రాగన్ సైన్యాలు
By సుభాష్ Published on 11 Sept 2020 12:16 PM ISTఎంత వీలైతే అంతగా మనదేశాన్ని ఇబ్బందులు పెట్టాలని డ్రాగన్ దేశం విశ్వప్రయత్నాలు చేస్తోంది. తాజాగా బయటపడిన వ్యూహం ప్రకారం మనదేశాన్ని మూడు వైపులా రోగ్ నేషన్ గా ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా కమ్ముకుని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నట్లు బయటపడింది. మూడు వైపులా అంటే ఒకవైపు లడ్డాఖ్ లోయ ప్రాంతంలో తన కబ్జాలను కొనసాగిస్తోంది. అదే సమయంలో రెండోవైపు పాకిస్ధాన్ వైపు నుండి టెర్రరిస్టులను చొరబాట్ల ద్వారా భారత్ సరిహద్దులు దాటించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. పనిలో పనిగా నేపాల్ జనాలను కూడా రెచ్చగొడుతు భారత్ మీదకు ఉసిగొల్పుతోంది.
డైరెక్టుగా తాను భారత్ సైనికులపై పై చేయి సాధించలేనన్న విషయం డ్రాగన్ సైన్యానికి బాగా అర్ధమైపోయుంటుంది. గాల్వాన్ లోయలో ఏదో మొదటిసారి మన సైన్యాలు ఏమరుపాటుగా ఉండటంతో కొంతవరకు చైనా సైనికుల ఆటలు సాగాయి. ఎప్పుడైతే స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్సు దళాలు ఎంటరయ్యాయో అప్పటి నుండే చైనా సైనికుల సీన్ రివర్సయిపోయింది. దాని ఫలితంగానే మన సైనికులు 20 మంది చనిపోతే చైనా సైనికులు 35 వరకు మృతిచెందటం. మొత్తానికి ముందు మన సైనికులు దెబ్బతిన్నా వెంటనే తేరుకుని ఎదురుదాడులు చేయటంతో చైనా తోకముడవక తప్పలేదు.
గాల్వాన్ లోయలో జరిగిన ఘటనతో చైనా ఎంతటి దొంగ దెబ్బ తీయటానికైనా వెనకాడదన్న విషయం మన సైన్యానికి బాగా అర్ధమైపోయింది. అప్పటి నుండి నూరుశాతం అప్రమత్తతో సరిహద్దుల్లో వెయ్యి కళ్ళతో కాపలా కాస్తోంది. దాంతో చైనా సైన్యం ఆటలు సాగటం లేదు. దాంతో దొంగాటలాడుతోంది. వెనకనుండి కవ్వించటం, రాత్రిళ్ళు రాళ్ళు రువ్వటం, ఇనుప రాడ్లు పట్టుకుని మన సైన్యం మీదకు దూకటం లాంటివి చేస్తోంది. అయితే ఇలాంటి వాటిని ముందే ఊహించిన మన సైన్యాలు అన్నింటికీ తెగించే అప్రమత్తంగా ఉండటంతో చైనా సైన్యం ఆటలు ఏమాత్రం సాగటం లేదు.
లడ్డాఖ్ లోయతో పాటు రైజినా పాస్ లాంటి పర్వత ప్రాంతాల్లోని ఫింగర్స్ గా ప్రచారంలో ఉన్న ఎనిమిది ఎత్తైన పర్వతాల్లో ఐదింటిని మనసైన్యం చైనా నుండి స్వాధీనం చేసేసుకోవటంతో చైనా కు దిక్కుతోచటం లేదు. ఎందుకంటే పాంగ్యాంగ్ సరస్సు ప్రాంతంలోని పర్వాతల పైనుండి క్రిందవైపు చైనా సైన్యం కదలికలను మన సైన్య స్పష్టంగా చూడగలుగుతోంది. అందుకనే మనసైన్యం కళ్ళు కప్పటం చైనాకు సాధ్యం కావటం లేదు. అదే సమయంలో ఇరు దేశాల సైన్యాలు తమకు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో భారీ ఎత్తున యుద్ధ ట్యాంకులను, హెలికాప్టర్లను, యుద్ధ విమానాలను, క్షిపణులు తదితరాలను మోహరిస్తున్నాయి.రక్షణ రంగం నిపుణులు, రక్షణ రంగం విశ్లేషకులు చెప్పేదాని ప్రకారం ఇప్పటికే చైనా సుమారు లక్షన్నర సైన్యాన్ని సరిహద్దులో మోహరించిందట. అలాగే వందలాది యుద్ధ ట్యాంకులను, క్షిపణులను ప్రయోగించే పరికరాలతో సిద్ధంగా ఉందట. కాబట్టి మన సైన్యం కూడా అంతే రీతిలో సరిహద్దుల్లో రెడీ అవుతోంది. రాత్రుళ్ళు సరిహద్దుల వెంబడి గస్తీ తిరగ్గలిగిన హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగేసింది. మొత్తంమీద డైరెక్టుగా మన సైన్యాన్ని ఏమి చేయలేని డ్రాగన్ తన బుద్ధిపోనిచ్చుకోకుండా పాకిస్ధాన్ వైపు నుండి టెర్రరిస్టులను, నేపాల్ నుండి జనాలను కూడా తన స్వార్ధానికి వాడుకుంటోందని తేలిపోయింది.