తండ్రి కారు కింద పడి చిన్నారి దుర్మరణం

By అంజి  Published on  25 Feb 2020 6:16 AM GMT
తండ్రి కారు కింద పడి చిన్నారి దుర్మరణం

హైదరాబాద్‌లో ఓ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదవశాత్తు ఓ చిన్నారి పాప కారు కింద పడి దుర్మరణం పాలైంది. ఈ ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి పాప.. తన తండ్రి కారు కిందే పడి మరణించింది. దీంతో ఆ ఇంట విషాదం నెలకొంది. మరో 24 గంటల్లో శుభకార్యం జరగాల్సిన ఆ ఇంట్లో శోకసంద్రం నెలకొంది.

ఎస్సై వెంకటేష్‌ తెలిపిన వివరాల మేరకు.. బార్కస్‌ సలాలా ప్రాంతంలో కారు డ్రైవర్‌ ఖాలెద్‌ సారి (28) తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఇతనికి 18 నెలల వయసున్న కుమార్తె హుదా సారి ఉంది. ఖాలెద్‌సారి అన్న స్మాల్మీన్‌ బిన్‌ అవద్‌సారికి కుమార్తెకు పెళ్లి నిశ్చయించారు. సోమవారం రోజున విహహాం ఏర్పాటు చేయగా.. ఈ నెల 26న విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. పెళ్లి వేడుకల్లో భాగంగా ఇళ్లును రంగుల విద్యుద్దీపాలతో ఆలంకరించారు.

బంధువులు అంతా ఇంటికి చేరుకున్నారు. కాగా శనివారం రాత్రి సాంచక్‌ వేడుకను నిర్వహించారు. అనంతరం సోమవారం తెల్లవారుజామును బంధువులను వారి ఇళ్ల వద్ద దింపేందుకు ఖాలెద్‌ తన కారును బయటకు తీశారు. అందరూ కారు ఎక్కిన తర్వాత మెల్లగా ముందుకు పోనిచ్చాడు. ఇంతలోనే గారలపట్టి హుదాసారి.. తన తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అయితే కారు ఎడమవైపు వచ్చిన ఆ చిన్నారి కనిపించలేదు.

చిన్నారి హుదాసారిపైకి కారు ఎడమ చక్రం ఎక్కడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే కారు దిగిన ఖాలెద్‌ కూతురు అలాంటి పరిస్థితిలో బోరున విలపించాడు. వెంటనే బంధువుల సాయంతో హుదాసారిని ఓవైసీ ఆస్పత్రి తీసుకెళ్లారు. అయితే అప్పటికే హుదాసారి మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. కాగా ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి.. చిన్నారికి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పజెప్పారు. ముద్దులొలికే చిన్నారి ఇక లేకపోవడంతో.. ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది.

Next Story