దివ్య భారతి డెత్ మిస్టరీ - అసలు ఆ రోజు ఏం జరిగిందంటే?
By రాణి Published on 25 Feb 2020 10:53 AM IST
దివంగత నటి శ్రీదేవి అంతటి సొగసు దివ్య భారతి సొంతం. పిన్న వయసులోనే సినీ అవకాశాలు క్యూ కట్టినా రెండేళ్లు గ్యాప్ ఇచ్చి 16 ఏళ్ల ప్రాయంలో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అలా ఎంట్రీ ఇచ్చిందో లేదో.. ఇలా స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ అవకాశాలు వెల్లువెత్తాయి. చేసిన ప్రతీ సినిమా హిట్ కావడంతో రోజుకు రూ. లక్ష పారితోషకం తీసుకునే బాలీవుడ్ హీరోయిన్ లిస్ట్‌లో ఒకరిగా దివ్య భారతి చేరారు.
సినీ కెరీర్‌లో అడుగుపెట్టింది 16 సంవత్సరాలలోనే అయినా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని దూసుకుపోతున్న రోజుల్లో దురదృష్టవశాత్తు మరణించింది. అయితే, దివ్య భారతి చనిపోయే రోజు ఏం జరిగింది? ఎలా చనిపోయింది? అన్న ప్రశ్నలకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి కచ్చితమైన సమాధానం లేదు. కేసు దర్యాప్తును కూడా పోలీసులు క్లోజ్ చేసేశారు.
కాగా,ఓం ప్రకాష్, మీఠా భారతి దంపతులకు 1974 ఫిబ్రవరి 25వ తేదీన ముంబైలో దివ్య భారతి పుట్టింది. ఓం ప్రకాష్‌కు మీఠా భారతి రెండో భార్య. అతినికి సినిమాలపట్ల ఎక్కువ ఆసక్తి ఉండటంతో ఎక్కువగా ముంబైలో సినిమా వాళ్లు ఉండే ప్రాంతంలో నివాసం ఉండేవారు. దివ్య భారతికి హిందీ, ఇంగ్లీష్, మరాఠి భాషలు స్పష్టంగా వచ్చు.
బొబ్బిలిరాజా తో అరంగేట్రం
దివ్య భారతి ముంబైలోని మకెంజి కూపర్ హైస్కూల్‌లో చదువుతూ ఉండగా. చాలా చిన్న వయసులోనే నందు తులాని అనే డైరెక్టర్ గుడా హుంకా దేవతా అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సమయంలో దివ్య భారతి తల్లిదండ్రులను అడగ్గా, అప్పటికి ఆమె వయసు చాలా చిన్నది అంటూ వారు ఆ ఫర్‌ను తిరస్కరించారు.
ఆ తరువాత కొంత కాలానికి అమీర్ ఖాన్, గోవింద నటించబోయే కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా చేసేందుకు ఒప్పుకుంటూ ప్రాజెక్ట్స్‌పై సంతకాలు కూడా చేసింది. కానీ, ఆ ప్రాజెక్ట్స్‌లో తనను కాదని వేరొకరిని షీరోయిన్ పాత్ర వరించింది. ఇలా చిన్న వయసులోనే కెరీయర్ మొదట్లోనే చాలా విసిగిపోయినా తనలో మాత్రం బాలీవుడ్ హీరోయిన్‌గా ఎదగాలన్న ఆశ మాత్రం అలానే ఉండిపోయింది.
అటువంటి సమయంలోనే ప్రముఖ ప్రొడ్యూసర్ డా.రామానాయుడు తాను తీయబోయే నెక్ట్స్ సినిమాలో ఒక కొత్త హీరోయిన్ కోసం చూస్తున్నారని దివ్య భారతికి తెలియడం, ఆడిషన్స్‌లో ఆమె రామానాయుడుకు నచ్చి సినిమా మొదలు పెట్టడం అంతా జరిగిపోయింది. అలా బాలీవుడ్‌లో రాణించాలనుకున్న దివ్య భారతి. తన మొదటి సినిమా తెలుగులోనే నటించింది. ఆ సినిమానే బొబ్బిలి రాజా. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు ఆమె వయసు 16 సంవత్సరాలు.
ఇలా తెలుగులో తన సినీ కెరియర్‌ని మొదలుపెట్టగా, ఆ సినిమా సూపర్ సక్సెస్‌ను అందుకోవడం, ఆ తరువాత ఆమెను అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక 1990లోనే ఆమె సక్సెస్ విషయంలో అస్సలు వెనక్కు అడుగు వేయలేదు.
తెలుగులో నటించిన బొబ్బిలి రాజా. అసెంబ్లీ రౌడీ, రౌడీ అల్లుడు, చిట్టెమ్మ మొగుడు, ధర్మక్షేత్రం, ఇలా అన్ని సినిమాలు బాక్సాఫీసు దగ్గర ఘన విసయాన్ని సాధించాయి.
ఒకే ఏడాది 14 సినిమాలు...
సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా నిలిచిపోయినప్పటికీ ఆమె ఆశ అంతా కూడా బాలీవుడ్‌పైనే ఉండేది. తనను కాదని తనకు వచ్చిన అవకాశాలను కెరీయర్‌లో మొదట్లో ఇచ్చారని, బాలీవుడ్‌లో తన సత్తా చాటాలన్న ఉద్దేశంతో సౌత్‌లో ఎన్నో మంచి మంచి ఆఫర్స్ వచ్చినప్పటికీ వాటన్నిటిని కాదనుకుని ముంబైకి వెళ్లింది. ఇలా బాలీవుడ్‌లో విశ్వాత్మ అనే సినిమాతో అడుగుపెట్టింది.
ఇలా దివ్య భారతి బాలీవుడ్‌లో మొదటిసారిగా నటించిన విశ్వాత్మ సినిమా 1992లో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర ఘన విజయం సాధించడమే కాకుండా ఆ సినిమాలో దివ్య భారతి వేసిన స్టెప్పులు అందర్నీ షేక్ చేశాయి. దీంతో ఒక్కసారిగా ఆమెకు ఆ రోజుల్లో ఒకే సంవత్సరం 14 సినిమాలకు సైన్ చేసింది. ఆ రోజుల్లో రోజుకు లక్ష రూపాయల పారితోషకాన్ని శ్రీదేవి, మాధురి దీక్షిత్ వంటి స్టార్ హీరోయిన్స్ మాత్రమే తీసుకునేవారు. అటువంటి వారి జాబితాలో మూడో హీరోయిన్‌గా దివ్య భారతి వచ్చి చేరింది.
మతం మార్చుకుని ప్రేమ పెళ్లి
తన నటనతో, అందంతో తక్కువ సమయంలోనే స్టార్‌డమ్ సంపాదించిన ఆమె జీవితంలోకి ప్రేమ అనే రెండు అక్షరాలు వచ్చి చేరాయి. ఇది ఆమె అంతానికి దారి తీసిందనే వాదనలు కూడా ఉన్నాయి. దివ్య భారతి గోవిందతో నటిస్తున్న షోలా ఔర్ బదనామ్ సినిమా షూటింగ్‌కి గోవిందంని కలుసుకునేందుకు షాజిద్ నడియాద్వాల వస్తుండేవాడు.
ఇలా గోవిందతో మాట్లాడేందుకు వచ్చిన షాజిద్ మాటల్లో మాట దివ్య భారతితో కలిపేవాడు. ఇలా కొన్ని రోజుల్లోనే వీరి మధ్య ప్రేమ చిగురించడం, ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లింది. దివ్య భారతి తన కెరీర్‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం సజిద్ నడియాద్వాలతో చిన్న వయసులోనే ఇంట్లో వాళ్లకు కూడా చెప్పకుండా రహస్యంగా పెళ్లి చేసుకుంది. అంతేకాకుండా, మతం మార్చుకుని సన అన్న పేరును కూడా పెట్టుకుంది.
1993 ఏప్రిల్ 5వ తేదీన ఆమె షూటింగ్ పూర్తి చేసుకుని తన తమ్ముడు కునాల్‌తో కలిసి ముంబైలోని తాను షాజిద్‌తో కలిసి ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లింది. అయితే, ఆమె మరుసటి రోజే హైదరాబాద్ షూటింగ్‌కి వెళ్లాలి కానీ, ఆ సినిమా ప్రొడ్యూసర్‌కి కాల్ చేసి తన కాలికి గాయమైందని, చెన్నైకి షూటింగ్ నిమిత్తం రాలేకపోతున్నానని, ఆ షూటింగ్‌ను క్యాన్సిల్ చేసుకుని తన అపార్ట్‌మెంట్‌కు చేరుకుంది.
దివ్య భారతి ఇంటికి వెళ్లిన కొద్ది సేపటికే అప్పటి వరకు లోపలే ఉన్న షాజిద్ బయటకు వెళ్లిపోయాడు. కాసేపటికే తమ్ముడు కునాల్ కూడా ఇంటి నుండి వెళ్లిపోయాడు. ఆ సమయంలో అమృత అనే మహిళ మాత్రమే దివ్య భారతితోపాటు ఇంట్లో ఉంది. దివ్య భారతి ఎందుకో సడెన్‌గా తన కాస్టూమ్స్ గురించి మాట్లాడాలని, తన కాస్టూమ్ డిజైనర్, తన ఫ్రెండైన నీతుళ్లను అర్జెంట్‌గా తన ఇంటికి రమ్మంటూ కాల్ చేసింది.
ఆ రోజు రాత్రి..
ఆ రోజు రాత్రి డిజైనర్ నీతుళ్లతోపాటు, ఆమె భర్త కూడా దివ్య భారతితో కాస్టూమ్స్ డిజైన్స్ గురించి మాట్లాడుకున్నారు. కాసేపటికి అమృత, కిచెన్‌లోకి వెళ్లగా, నీతులా, శ్యామ్ టీవీలో ఏదో ప్రోగ్రామ్ చూస్తూ ఉండిపోగా, దివ్య భారతి బాల్కనిలోకి వెల్లింది. అక్కడ ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. వెళ్లి చూడగా ఐదో అంతస్తులో ఉన్న దివ్య భారతి ఇంటి బాల్కని నుండి కింద పడిపోయింది.
వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే కొన ఊపరితో ఉన్న దివ్య భారతి మరణించిందని వైద్యులు ధృవీకరించారు. ఒక్కసారిగా వార్త తెలిసిన జనాలందరూ షాక్‌లోకి వెళ్లిపోయారు. ఇలా దివ్య భారతి మరణించిందని తెలియగానే ఆమె మరణం వెనుక ఎన్నో రకాల వార్తలు బయటకొచ్చాయి.
ఆమెను పక్కా ప్లాన్‌తో చంపారని కొందరు, సూసైడ్ చేసుకుందని కొందరు. తాగి ప్రమాదవశాత్తు మరణించిందంటూ మరికొందరు ఇలా ఇప్పటికీ చాలా మంది రకరకాలుగా చెప్పుకుంటారు. మరోపక్క దివ్య భారతి చనిపోయిన ఐదు సంవత్సరాలకు సరైన ఆధారాలేవీ లభించలేదంటూ పోలీసులు కేసు కొట్టేశారు.
ఇక దివ్య భారతి మరణ సమయంలో దగ్గర్లోనే ఉన్న అమృత నెల రోజులకే గుండెపోటుతో చనిపోయింది. అయితే, దివ్య భారతి చెన్నై నుండి ముంబైకి ఎందుకు వచ్చింది? మరుసటి రోజు హైదరాబాద్‌లో జరగాల్సిన షూటింగ్‌కి ఎందుకు వెళ్లలేదు. ఆ రోజు రాత్రి అంత అర్జెంట్‌గా మట్లాడాలని తన ఫ్రెండ్‌ని ఎందుకు పిలిచింది..? ఆమె వీళ్లతో మట్లాడుతున్న సమయంలో భర్త షాజిద్‌తోపాటు, తమ్ముడు కునాల్ ఎందుకు ఇంట్లో లేడు? ఇలా ఎన్నో ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.